నందిపేట, బతుకమ్మ :
మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి నందిపేట సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 4 రోజుల జైలు శిక్ష విధించింది. డ్రంకన్ డ్రైవ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జూలై 12 న నందిపేటలో పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భైంసాకు చెందిన బోయిడి అదెలు పట్టుబడ్డాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, సోమవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ నిందితుడికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు.
