నిజామాబాద్, బతుకమ్మ :
నిబంధనలకు విరుద్దంగా అసైన్మెంట్ భూములను నందిపేట్ తహసీల్దార్ సంతోష్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ .. విచారణ జరిపించిన అనంతరం సస్పెండ్ చేసారు. మండలంలోని ప్రతి గ్రామంలో అసైన్మెంట్ భూములు అధికంగా ఉన్నాయి. ఆస్తి బదలాయింపు కోసం వేచి ఉన్న దరఖాస్తులను లబ్దిదారులతో మాట్లాడుకొని వాటిని పట్టాలు చేస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్ళాయి. దీనిపై ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ విచారణ చేసి కలెక్టర్ కు నివేదికను అందజేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నందిపేట్ తహసిల్దార్ సంతోష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

ఉదయం తనిఖీ… సాయంత్రం వరకు తహసీల్దార్ పై వేటు వేసిన జిల్లా కలెక్టర్
నందిపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన సందర్భంగా లోపాలను గుర్తించి తహసిల్దార్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా అక్రమాలకు తావు కల్పించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు అసైన్డ్ భూములు కబ్జాకు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. రికార్డులను పక్కాగా నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ ఉన్నారు. ఉదయం హెచ్చరించిన జిల్లా కలెక్టర్ సాయంత్రం వరకు తహసీల్దార్ సంతోష్ రెడ్డిపై వేటు వేయడం కలకలం రేపింది. రెవెన్యూ శాఖ లో తహసీల్దార్ ని సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

