27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు రూ.9.24 కోట్లు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బహిరంగ మార్కెట్ లో 100 కోట్ల పై మాటే

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చీఫ్ ఇంజినీర్ బి. రవీందర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం – 1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసిన అధికారులు, మంగళవారం ఆయన నివాసం, కార్యాలయం, బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన మరో తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ తెలిపింది. అధికారిక విలువ ప్రకారం కొండకల్, కిష్టాపూర్, పసుమాముల ప్రాంతాల్లో ఐదు ఖాళీ ప్లాట్లు రూ.38.89 లక్షలు, నర్సింగి, నానక్‌రామ్‌గూడలో నాలుగు ఫ్లాట్లు రూ.2.07 కోట్లు, కొత్తూరు మండలం గూడూరు గ్రామం, శంషాబాద్ ప్రాంతాల్లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి రూ.6 లక్షలు, శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలోని శ్రీవారి మెడోస్‌లో 300 చదరపు గజాల సెమీ ఫినిష్డ్ విల్లా రూ.1.33 కోట్లు, కొండాపూర్ మసీద్‌బండలో 300 చదరపు గజాల్లో నిర్మించిన జీ+4 భవనం రూ.3 కోట్ల విలువైనవిగా గుర్తించారు. అయితే, ఈ ఆస్తుల మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అదనంగా రూ.3.82 లక్షల నగదు, సుమారు రూ.45.05 లక్షల బ్యాంకు నిల్వలు, 1,440 గ్రాముల బంగారు ఆభరణాలు (సుమారు రూ.36.70 లక్షలు), 12.5 కిలోల వెండి ఆభరణాలు (సుమారు రూ.10 లక్షలు), రూ.17.24 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.9.32 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు (ఏడు శాంసంగ్ మొబైల్ ఫోన్లు, రెండు స్మార్ట్‌వాచ్‌లు, ఒక ఐప్యాడ్, రెండు ట్యాబ్లెట్లు, ఐదు హార్డ్‌డిస్క్‌లు తదితరాలు) కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు విలాసవంతమైన వాహనాలు కూడా గుర్తించారు. వీటిలో ఇన్నోవా హైక్రాస్ (రూ.40 లక్షలు), టాటా సఫారి (రూ.31 లక్షలు), ఇన్నోవా క్రిస్టా (రూ.25 లక్షలు), మహీంద్రా ఎక్స్‌యూవీ (రూ.20 లక్షలు) ఉన్నాయి. సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.9,24,02,276గా ఏసీబీ అంచనా వేసింది. అయితే మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. నిందితుడిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం (ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, ఎస్పీఈ & ఏసిబి కేసులు) ఎదుట హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్ కోరనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

More articles

Latest article