27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీ వలలో చేర్యాల తహసీల్దార్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ.70 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

 

సిద్దిపేట, బతుకమ్మ :

 

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 2:40 గంటల సమయంలో తన కార్యాలయంలో రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, నాగపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/B, 833/C, 833/D, 833/E, 834/B, 834/C, 834/D, 834/Eలలో మొత్తం 30 గుంటల భూమికి సంబంధించిన 11 నాలా కన్వర్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి అధికారిక అనుమతులు మంజూరు చేయడానికి తహసీల్దార్ లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దరఖాస్తుల్లో ఇప్పటికే ఎనిమిది దరఖాస్తులు ప్రాసెస్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ భూములు జమున కనకమ్మతో పాటు ఇతరుల పేర్లపై ఉన్నాయి. ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి, నిందితుడి వద్ద నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు లంచం స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ ఘటన అనంతరం తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్‌ను అరెస్టు చేసిన అధికారులు, హైదరాబాద్‌లోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల (ఎస్‌పీఈ & ఏసీబీ) కేసుల విచారణకు సంబంధించిన గౌరవ ద్వితీయ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను ఏసీబీ గోప్యంగా ఉంచింది.

More articles

Latest article