కామారెడ్డి, బతుకమ్మ:
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు, ఫీస్ రీ ఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో విద్యార్థుల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని పెట్టిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తుందని, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని అన్నారు. విద్యార్థులను పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు మోసపోయి ఓట్లు వేసి ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కమీషన్ల ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కళాశాలలు మూత పడే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
