. . . మెండోరా పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీపీ
మెండోరా, బతుకమ్మ:
మెండోరా పోలీస్ స్టేషన్ సరిహద్దులో నిర్మల్, మెట్ పల్లి ప్రాంతాలు ఉన్నందున సరిహద్దుల రాకపోకలపై ఎల్లప్పుడు నిఘా వ్యవస్థ ఉండాలి అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెండోరా పోలీస్ స్టేషన్ ను సిపి సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, నేర పరిశోధన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై పాఠశాలల్లో విద్యార్థులకు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో విలేజ్ ఆఫీసర్ లు విధులు నిర్వహించేవారు ప్రజలతో మమేకమై గ్రామాల సమస్యలు పరిష్కరించే విధంగా పనులు జరగాలని అన్నారు. గ్రామాల్లో యువత ముఖ్యంగా విద్యార్థులు మత్తు పధార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపాలని సూచనలు చేశారు. అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలని కోరారు. సిపి తో పాటు ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్ఐ సుహాసిని ఉన్నారు.

