. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకొని విద్యాసంస్థల నిర్వాహకుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని గల అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టాన్ని కొన్ని విద్యార్థి సంఘాలు తమ చేతిలోనికి తీసుకోని స్కూల్స్, కాలేజీలలో ప్రవేశించి అలజడి సృష్టించడం జరుగుతుందని, ఏవో కొన్ని వసతులు లేవని, పుస్తకాలు అమ్ముతున్నారనే కారణాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, విద్యాసంస్థలను ఇబ్బందులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని వివిధ సమస్యలపై విద్యాసంస్థల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపూర్, బర్దిపూర్ శివారులోని నారాయణ విద్యాసంస్థ పై అక్రమంగా ప్రవేశించి అక్కడ కుర్చీలు , ఫ్లెక్సీలు మొదలగునవి ధ్వంసం చేయగా వారిపై, అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూరు మండలంలో శ్రీ సాయి విద్యాలయం స్కూల్లో యాజమాన్యం అనుమతి లేకుండా ప్రవేశించి సిబ్బందిని బెదిరిస్తూ పిల్లలను భయాందోళనకు గురి చేస్తూ కొన్ని వస్తువులను ధ్వంసం చేసినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ రెండు కేసులలో వున్నవారు గతంలో కూడా కేసులు ఉన్నట్లయితే వారిపై అదనపు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు. విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిపై సంబంధిత జిల్లా అధికారులకు లేదా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సమస్యలపై అధికారులకు నిబంధన ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతేకానీ విద్యార్థి సంఘాల పేరు చెప్పుకొని పాఠశాలలో ఇబ్బందికర వాతావరణ సృష్టించవద్దని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తూ వారికి అసౌకర్యం కలిగించకూడదని సూచించారు. అలాంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్కూల్స్, కాలేజీలు ఎవరు కూడా బంద్ చేయించరాదు, అలా విద్యాసంస్థలను బంద్ చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
