. . . సర్ ఫాం ఎలా నింపాలో తికమక పడుతున్న ప్రజలు
. . . 2002 ఓటరు జాబితా కోసం వెతుకులాట
రుద్రూర్, బతుకమ్మ :
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పని సరిగా నమోదు చేయాల్సి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 ఏళ్ల క్రితం తమ ఓటరు సంఖ్య, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. దీంతో సర్ సర్వే నత్తనడకన సాగుతున్నది. అంటే ఓటర్లు ఫారాలు నింపేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో దీనిని బట్టే అర్థం అవుతున్నది. రాష్ట్రంలో దొంగ ఓట్లు, మరణించిన ఓటర్లను తొలగించడంతో పాటు కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) చేపట్టిన విషయం తెలిసిందే.
. . . 2002 ఓటరు జాబితా కోసం వెతుకులాట
ఎస్‌ఐఆర్‌లో మొదటి కాలమ్‌లోనే 2002 నాటి ఓటరు వివరాలు నమోదు చేయాలని ఎన్నికల సంఘం సూచించడంతో సమస్య మరింత జఠిలమైంది. ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ, 2002లో తమ పేరు ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సాధారణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్‌వోల వద్ద ఒక పీడీఎఫ్ రూపంలో మాత్రమే పాత జాబితా ఉండటంతో మొబైల్‌లో చూసి వివరాలు చెబుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియని వారు, నిరక్షరాస్యులు, వృద్ధులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కూడా ఓటర్ల సమస్యలను పెంచుతోంది. అప్పట్లో ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం వేరే నియోజకవర్గాల్లో ఉండటంతో 2002 వివరాలను గుర్తించడం కష్టమవుతోంది. దీంతో ఫారాల భర్తీ ఆలస్యమవుతోంది. ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిలో వివరాలను సక్రమంగా భర్తీ చేయకపోతే ఓటు హక్కు ఉంటుందా, పోతుందా అని ఆందోళన చెందుతున్నారు. కావున సర్ ప్రక్రియ పై మరింత అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
