. . . ప్రజలు కాలనీల్లోకి రానివ్వడం లేదు
. . . క్షేత్రస్థాయిలో అధికారులు తీరు వల్లనే సమస్యలు
. . . నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై కార్పొరేటర్ల గరంగరం
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగర పాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి వాడివేడిగా జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలను ఎజెండాను ఆమోదించి మమ అనిపించుదామని బల్ధియా అధికారులు తెచ్చిన ప్రయత్నానికి కార్పొరేటర్లు గండికొట్టారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, మిత్రపక్ష మజ్లీస్ పార్టీ కార్పొరేటర్లు డివిజన్ లలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రధానంగా నిజామాబాద్ నగరం వీధి దీపాలు లేక అంధకారంలో ఉన్న పాలకవర్గం ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎక్స్ అఫిషియో హోదాలో ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, డా.భూపతిరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశం ప్రారంభం కాగానే వీధి దీపాలపై నగర కార్పొరేటర్లు, పాలకవర్గంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నగర నలుమూలల వీధి దీపాలు లేక అంధకారంలో మగ్గుతుందని వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు. డివిజన్ లలో సమస్యలు ఎక్కడ వేసినవి అక్కడే ఉండగా ప్రజలు డివిజన్ లలోకి రానివ్వడం లేదని, కాలనీల్లోకి అడుగుపెట్టలేకపోతున్నామని అన్నారు. డివిజన్ లలో డ్రైనేజీ, చెత్త సమస్యలపై సానిటరి ఇన్స్ పెక్టర్లకు, సిబ్బందికి సూచనలు చేసిన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత పాలకవర్గం హయాంలో వందల మందిని రిక్రూట్ చేసినా నెలవారీగా వేతనాలు చెల్లిస్తున్నా 60 డివిజన్ లలో మాత్రం పారిశుద్య సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. సానిటరి విషయంలో జవాన్లు, సానిటరి ఇన్స్ పెక్టర్లు, కార్పొరేటర్ల మాటలను పట్టించుకోవడం లేదని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. ప్రధానంగా నగరంలో డ్రైనేజీలు, చెత్త సమస్యల వల్లనే ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు.

. . . నగరాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నగరాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి.

. . . కార్పొరేటర్ల కు స్పందించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నగరంలోని అన్ని డివిజన్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. కనీస మౌలిక సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం ఇబ్బందికరం. అలాగే కార్పొరేటర్లకు సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ లో ఆయా విభాగాల అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. స్పెషల్ ఫండ్ లేకపోవడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కళాభారతి తదితర పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయన్నారు. అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద నగరంగా నిలిచిన నిజామాబాద్ కు అర్బన్ డెవలప్ మెంట్ ఫండ్ తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. యూడీఎఫ్ కింద రూ. 400 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఇటీవలే ఇందుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేయించామన్నారు. అలాగే మరో కేంద్ర పథకం కింద రూ.200 కోట్ల కోసం కూడా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా నగరంలో యూజీడి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
. . . నగర అభివృద్ధికి చర్చ శూన్యం . . నిధుల కొరకు ప్రయత్నం నిల్
నిజామాబాద్ నగరం అభివృద్ధి కోసం నగర పాలక సంస్థ తొలి సమావేశం చర్చలు శూన్యమని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ నగరం డెవలప్ మెంట్ కోసం వస్తున్న నిధులు అంతంత మాత్రమే. నగర పాలక సంస్థ ఎన్నికల తర్వాత నగరం అభివృద్ధికి మార్పు వస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. మంగళవారం జరిగిన బల్ధియా సమావేశంలో కనీసం నగరం అంధకారం నుంచి విముక్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి పాలక మండలి కానీ, ప్రజాప్రతినిధులు కానీ హామీ ఇవ్వలేకపోయారు. ప్రధానమైన మాస్టర్ ప్లాన్ అంశాన్ని లేవనెత్తి దాన్ని అసెంబ్లీ ఆమోదానికి పంపే విషయంలో చర్చ ఆస్కారం లేకుండా పోయింది. నగర ప్రజల దశాబ్ధాల కల ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు, నిధులపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఉన్నప్పటికీ రూట్ మ్యాప్ పై చర్చించకపోవడం గమనార్హం. నగరంలో యూజీడీ పనులు నత్తతో పోటీ పడుతున్నా నిధుల కొరతను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న చర్చ జరిగిందా లేదా అంటే సమాదానం చెప్పెవారు లేరు. నగరంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసి రోడ్ల విస్తరణ చేస్తారా అనే అంశాన్ని లేవనెత్తిన వారే కరువయ్యారు. నగర పాలక సంస్థ సమావేశంలో డ్రైనేజీలు, చెత్త గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడిన 60 డివిజన్ లు ఉన్న కార్పొరేషన్ నిధుల సేకరణ, డీపీఆర్ పై ఏ పార్టీ ఏ నాయకులు చర్చించకపోవడంతో ప్రజల ఆశలు వమ్మయ్యాయి.

