. . . పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం వంటి ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన సిఎల్ సి అవగాహన తరగతుల్లో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎల్ సి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ముందస్తు హెచ్చరిక లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం వారి జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే కార్మికులకు కనీస వేతనాలు, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కూడా జీవించే హక్కులో భాగమేనని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, ర్యాలీలు నిర్వహించే హక్కును కూడా ప్రభుత్వాలు పరిమితం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. పౌష్టికాహారం అందక ప్రజలు ఆకలితో మరణించడం కూడా జీవించే హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. హక్కుల కోసం ప్రశ్నించే వారిపై దేశద్రోహం వంటి ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో లాకప్ మరణాలు, ఎన్‌కౌంటర్లు, వరకట్న హత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎల్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడంతో పాటు పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవడం, ప్రకృతి వనరులను కాపాడడం, నిమ్న వర్గాలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడం, మహిళల హక్కులను రక్షించేందుకు ప్రజలు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిఎల్ సి జిల్లా అధ్యక్షుడు వి. సంగం మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల ప్రభావం పాలనా వ్యవస్థపై పెరుగుతోందని, దేశ సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. సిఎల్ సి రాష్ట్ర కోశాధికారి ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ, పౌర హక్కుల సంఘం రాజ్య హింసను ప్రశ్నించడమే కాకుండా పత్రికా స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణ, మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం వంటి రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం కూడా పోరాటాన్ని విస్తరించుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎల్ సి జిల్లా నాయకులు భీక్ సింగ్, జెలందర్, ఎడ్ల రాము, విజయ్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

