28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మహిళల సాధికారత కోసం ప్రభుత్వం, కుటుంబం, సమాజం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో వెటా ఇండియా నిర్వహించిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రకాల వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలు ఎంత ప్రతిభ కనబరిచినా, ఎంత కష్టపడినా ఏదో ఒక దశలో అవకాశాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు ఒక్కరోజులో రాదని, మహిళలు, పురుషులు కలిసి పనిచేసినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని చెప్పారు. మహిళలు తమ లక్ష్యాల విషయంలో దృఢనిశ్చయంతో ముందుకు సాగాలని, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గకుండా కష్టపడాలని సూచించారు. మహిళల సాధికారత కోసం వెటా ఇండియా సంస్థ, ఆ సంస్థ అధినేత ఝాన్సీ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, మంచి ఉద్యోగాల్లో ఉన్న మహిళలు ప్రమోషన్ల దశలో వివాహం, కుటుంబ బాధ్యతల కారణంగా కెరీర్‌లో వెనుకబడుతున్నారని చెప్పారు. పిల్లల పెంపకం కోసం కొంతకాలం ఉద్యోగాలకు దూరమైతే, తిరిగి చేరే సమయంలో జూనియర్ స్థాయి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో కూడా మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని పేర్కొన్న కవిత, పరీక్షలు రాసే మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నత పదవులకు చేరే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని అన్నారు. ప్రతిభ, కష్టపడి పనిచేసే సామర్థ్యం ఉన్నప్పటికీ మహిళలకు సమాన అవకాశాలు లభించడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తుచేసిన ఆమె, అయినప్పటికీ ఆ పోస్టులు పూర్తిగా భర్తీ కావడం లేదన్నారు. దీనికి కుటుంబ, సామాజిక మద్దతు కొరవడటమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లపై మాట్లాడుతూ, తాను రాజకీయ నాయకురాలిగా ఏదైనా అంశంపై మాట్లాడితే విషయంపై చర్చించకుండా లింగ ఆధారిత విమర్శలు, ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కవిత, 2026లో కూడా 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికల్లో 7.2 శాతం మంది వివాహం చేసుకుని తల్లులుగా మారుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా టీనేజ్ మదర్స్ శాతం 2.7 గా ఉందని చెప్పారు. ఆడపిల్లలకు పెళ్లి చేయడమే తమ బాధ్యత పూర్తయిందని ఇంకా చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారని విమర్శించారు. నేటి యువత సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకుల కోసం ఎక్కువగా ఆలోచిస్తోందని, కానీ నిజమైన ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు కూడా గతంలో నమోదైన సమాచార ప్రభావంతో కొంతవరకు పక్షపాత ధోరణి ప్రదర్శించే అవకాశముందని అన్నారు. “మీరు ఎలా ఉన్నారన్నది కాదు, మీ లక్ష్యం కోసం ఎంత కష్టపడతారన్నదే ముఖ్యమైనది. నిర్ణయం తీసుకోకపోవచ్చు, కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం మీ మాట మీరే వినకుండా కష్టపడాలి” అని మహిళలకు పిలుపునిచ్చారు.

 

Everyone must work together for women's empowerment.

More articles

Latest article