. . . రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి ఆనంద్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర పోలీస్ శాఖలో సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రజా అనుకూలమైన సేవలను అందించేందుకు స్టాండరైజ్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అమలుకు ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి.ఆనంద్ సూచించారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ, పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగుపరిచే అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లలో ప్రజలకు అందిస్తున్న సేవలు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ, బాధితులకు సహాయం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలలో ఏకరీతి విధానాలు పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, అక్రమ కార్యకలాపాల అరికట్టడం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ లలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ జిల్లా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్.శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ సి.టి.సి ఏసీపి లు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సి.సి.ఆర్.బి ఇన్స్ పెక్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

