29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బైక్ చోరీల ముఠాను పట్టుకున్న టౌన్ – 1 పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

బైక్‌లను దొంగిలిస్తూ పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడిని నిజామాబాద్ టౌన్ – 1 పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇన్స్ పెక్టర్ బి.రఘుపతి తెలిపారు. ఈ మేరకు టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 36/2026 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు వధేరా నవీన్ (22), కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలం శివపురం గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని నాందేవ్‌వాడలో నివాసం ఉంటూ మేస్త్రి పని చేస్తున్నాడు. అతను ఫాల్స్ కీ సహాయంతో పార్క్ చేసిన బైక్‌లను దొంగిలించేవాడని పోలీసులు తెలిపారు. జనవరి 2026 లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డులోని కవిత కాంప్లెక్స్ ముందు పార్క్ చేసి ఉన్న గ్లామర్ బైక్‌ టీ ఎస్ 16 ఈ ఎన్ 6948 ను దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ బైక్‌పై బాన్సువాడ వెళ్లి తిరిగి వస్తుండగా రైల్వే బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని ఆపారు. వాహన పత్రాలు చూపించాలని అడగగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని విచారించారు. విచారణలో అతను పలు బైక్ చోరీ కేసుల్లో తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. టౌన్-1, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొత్తం ఆరు కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నట్లు వెల్లడైంది. ఇక ఈ బైక్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసిన మరో ఇద్దరు నేరస్తులు మొహమ్మద్ మోయిజ్, అలకుంట మోహన్‌లను కూడా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కామారెడ్డి జిల్లా సోమేశ్వర గ్రామానికి చెందినవారు. దొంగిలించిన బైక్‌లేనని తెలిసినా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మొత్తం ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ప్రధాన నేరస్తుడు వధేరా నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్-1 ఇన్స్ పెక్టర్ బి. రఘుపతి వెల్లడించారు.

More articles

Latest article