. . . సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం
. . . మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రజల జీవన విధానం మెరుగవుతుంది
. . . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప కేంద్రం రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయడం లేదని, కనీసం 30 శాతం కూడా సేకరించడం లేదని వివరించారు. ముఖ్యమంత్రి తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం సమావేశమైంది. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పెండింగ్ ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయంపై ఈ సందర్భంగా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హామాలీలు తరలివెళ్లడంతో ఇక్కడ కొంత కొరత ఏర్పడిందని, అలాగే, ఎండల కారణంగా మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష చేస్తున్నానని తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామన్నారు. ఈ విషయంలో పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. మూసీ పునరుజ్జీవం చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందని, అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను వివరించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల యువతకు ఉపాధి లభించడమే కాకుండా నగర ప్రజల జీవన విధానం మెరుగవుతుందని చెప్పారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని, చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించారు. నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, అందులో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ, ఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించాలని సీపీఎం నాయకులను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావు తో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

