. . . ఇగల్ టీం అధ్వర్యంలో పలువురికి పాజిటివ్ టెస్ట్
. . . డ్రగ్స్ దందాలో నిందితులపై పిడియాక్ట్ లు పెడుతాం
. . పోలిస్ కమీషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జిల్లా పోలీస్ శాఖ ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమము పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా సీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుందని కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. గంజాయి డ్రగ్స్ వినియోగం ఆరోగ్యపరంగా ప్రమాదకరమే కాకుండా చట్టపరంగా కూడా తీవ్రమైన నేరమని ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైన వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకొని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని మళ్లీ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు రవాణా వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని విద్యాసంస్థలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య ఉపాధి, కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా తమ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం ఈగల్ టీం పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షల్లో కొంతమంది వ్యక్తులకు డ్రగ్స్ వినియోగం పాజిటివ్‌గా తేలడంతో వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏ.ఆర్) రామ్ చందర్రావు, నిజామాబాద్ ఏసీపి ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఈగల్ టీం డీఎస్పీ ఎం.సోమనాథం, హోమ్ గార్డ్ ఏసిపి కె. దీపక్ చంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ కె.శ్రీధర్ రెడ్డి, జిల్లాలోని సిఐలు, ఎస్.హెచ్.ఓ లు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

