28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు భేష్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

. . . కలెక్టర్ తో కలిసి అధికారులతో సమీక్ష

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో పౌర సరఫరాలు, రెవెన్యూ, రవాణా, సహకార తదితర శాఖలన్నీ ధాన్యం, మొక్కజొన్న సేకరణ విషయంలో సమర్ధవంతంగా పని చేస్తున్నాయని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు  వేల్పూర్, చెంగల్, ఆలూరు, మిర్జాపల్లి తదితర గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని అన్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గం మినహా, జిల్లాలోని మిగతా అన్ని చోట్ల ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. బాల్కొండ సెగ్మెంట్ లో వరి కోతలు కొంత ఆలస్యంగా పూర్తి కావడం వల్ల కేంద్రాలకు ధాన్యం దిగుబడులు వారం రోజుల క్రితం నుండి  రావడం ప్రారంభం అయ్యిందని, మరో మూడు రోజులలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిపేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుందని వివరించారు. అకాల వర్షాలు కురిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున పెద్ద ఎత్తున హమాలీలు, వాహనాలను సమకూరుస్తూ, ప్రతి రోజూ సగటున జిల్లాలో 15వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం సేకరిస్తూ రైస్ మిల్లులకు తరలించడం జరుగుతోందని అన్నారు. లోడింగ్, ఆన్ లోడింగ్ కు ఇబ్బందులు తలెత్తకుండా దూర ప్రాంతాల నుండి సైతం హమాలీలను రప్పించామని, ప్రతి రోజు 400 నుండి 500 లారీలు, ఇతర వాహనాలలో ధాన్యం రవాణా జరుగుతోందని వెల్లడించారు. ప్రభుత్వ గోడౌన్లలో స్థలాభావం ఏర్పడిన నేపథ్యంలో ప్రైవేట్ గిడ్డంగులను అద్దెకు తీసుకుని రైతుల నుంచి సేకరించిన వ్యవసాయ ఉత్పత్తుల భద్రపరుస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను సాఫీగా కొనసాగేలా అధికార యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోందని ఆన్నారు. మొక్కజొన్న సేకరణ సైతం తుది దశకు చేరిందని, మరో 10 వేల టన్నుల మొక్కజొన్న మాత్రమే కొనుగోలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. కాగా, పలు ప్రాంతాల్లో కొందరు రైతులు కొత్త కొత్త రకాల వరి వంగడాలను పంట సాగు కోసం వినియోగిస్తున్నారని, అలా కాకుండా మేలు రకం వరి విత్తనాలను వినియోగిస్తూ, నాణ్యమైన పంటను సాగు చేస్తే ధాన్యం దిగుమతి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా రైతులకు సూచించారు. పంట ఉత్పత్తుల కొనుగోలు విషయంలో విమర్శలు చేస్తున్న వారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అనేది గమనించి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఎంవీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article