. . . మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి
. . . ఎన్నికైన సభ్యులకు ఘన సన్మానం
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. మొత్తం నాలుగు కో-ఆప్షన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని బీఆర్ఎస్‌కు కేటాయించగా, మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులను కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఘనంగా సన్మానించారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎనికైనా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ కి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గోనే సునీత శ్రీనివాస్, ఆస్మా ముబషిర్, అలీ బిన్ అబ్దుల్లా లు ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన కుంభాల రవి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించారు. పూలమాలలు, శాలువాలతో వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకుందని, ఇప్పుడు కో-ఆప్షన్ స్థానాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా తీర్పు ఇచ్చారని అన్నారు.

పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ఒక కో-ఆప్షన్ స్థానాన్ని బీఆర్ఎస్‌కు కేటాయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేణి సందీప్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఉమా శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పండ్ల రాజు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్, గంప ప్రసాద్, పాత దివ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
