. . . రూ.32.60 లక్షల జరిమానా
. . . నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
గత రెండు వారాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 346 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నేరస్తులను నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరుపరచగా, వారిలో 29 మందికి కోర్టులు వారం రోజుల జైలు శిక్ష విధించాయని, మిగిలిన వారికి మొత్తం రూ.32,60,000 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. జూలై 20 నుంచి ఆగస్టు 1 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా సీపీ ప్రజలకు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగితే బీమా సదుపాయం లభించదని హెచ్చరించారు. మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని, జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మోటార్ వాహనాల చట్టం-1989 (2019 సవరణ) ప్రకారం, మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని, రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని సీపీ స్పష్టం చేశారు.
