. . . సాలూరా చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ
బోధన్, బతుకమ్మ :
చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు ప్రతి వాహనాన్ని అనుమానాస్పద కోణంలో పరిశీలిస్తూ అవసరమైతే సాంకేతిక పరికరాల సహాయంతో తనిఖీలు చేపట్టాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాలూర గ్రామ సరిహద్దు లోని చెక్ పోస్ట్ ను గురువారం సీపీ ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించారు. బక్రీద్ పండుగలో మూగ జీవాలు, వరి ధాన్యం ట్రాన్స్ పోర్టు నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు ముఖ్య సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా అనుమానాస్పద వస్తువులు, నిషేధిత పదార్థాలు, అక్రమ నగదు రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. తనిఖీల సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి, సరైన భద్రతా పరికరాలు ఉపయోగించాలని సూచించారు అదేవిధంగా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించడం, ట్రాఫిక్ నియంత్రణలో సమన్వయంతో వ్యవహరించడం అవసరమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో చెక్‌పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని సీపీ పేర్కొన్నారు. ఈ తనిఖీలలో బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందేర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

