. . . బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’
. . . తెలంగాణ రక్షణ సేన అజెండాను వివరించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా తమ సంస్థ ముందుకు వచ్చిందని ప్రకటిస్తూ, అన్ని అడ్డంకులను దాటుకుని ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొని, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, తమ కొత్త రాజకీయ వేదిక అయిన “తెలంగాణ రక్షణ సేన” లక్ష్యాలు, కార్యక్రమాలపై విస్తృతంగా మాట్లాడారు.
సర్వోదయ తెలంగాణ లక్ష్యం – ‘పాంచజన్యం’ అజెండా
తెలంగాణ సాధన తర్వాత రాష్ట్రం సర్వోదయ దిశగా పయనించాలని భావించామని, ఇప్పుడు అదే లక్ష్యంతో రాజకీయంగా ముందుకు వస్తున్నామని కవిత పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని, ఇందుకోసం “పాంచజన్యం” పేరుతో ఐదు కీలక అంశాలను రూపొందించామని వివరించారు. శ్రీకృష్ణుడు అధర్మంపై యుద్ధం చేయడానికి మోగించిన పాంచజన్యం శంఖాన్ని స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు. ప్రతిపక్షంగా ఉన్నా, అధికారంలోకి వచ్చినా ఈ ఐదు అంశాల అమలుపై కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
విద్య, వైద్యం – ప్రజలపై భారీ భారం
రాష్ట్రంలోని చాలా కుటుంబాలు తమ ఆదాయంలో 60 శాతం వరకు విద్య, వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలకు సేవింగ్స్ ఉండక, అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్నప్పటికీ, 75 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ సంస్థల్లోనే చదువుతున్నారని గుర్తు చేశారు. అలాంటి వారికి కూడా పూర్తిగా ఉచిత విద్య అందించేలా తమ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
వైద్య రంగంలో కూడా ప్రజలపై ఆర్థిక భారం అధికంగా ఉందని, ఆరోగ్యశ్రీ పథకం పరిమితులను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు డబ్బులు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం వెనుకడుగు వేయకూడదని ఆమె స్పష్టం చేశారు.
రైతుల సమస్యలు – కొనుగోలు కేంద్రాలపై విమర్శలు
రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ, కొనుగోలు కేంద్రాలు సమయానికి ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఎగుమతి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం ఎగుమతులకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఒక రైతు కొనుగోలు కేంద్రం వద్దే నాలుగు రోజులుగా వేచి ఉండి, చివరకు అక్కడే కుప్పకూలి మరణించిన ఘటనను గుర్తుచేస్తూ, రైతుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ముఖ్య లక్ష్యాల్లో ఒకటని తెలిపారు.
ఉపాధి, యువత – కొత్త అవకాశాలపై హామీ
రాష్ట్రంలో ఉపాధి పరిస్థితి దారుణంగా మారిందని కవిత విమర్శించారు. యువత ఆశయాలను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని అన్నారు. విదేశాల్లో యువతకు ప్రోత్సాహం ఇచ్చి వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని, అదే విధంగా తెలంగాణలో కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జెన్-జీ యువతపై తనకు విశ్వాసం ఉందని, వారి ఆలోచనలకు ప్రభుత్వం అండగా నిలవాలని భావిస్తున్నామని చెప్పారు. 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు అందించి, వారిని ఉద్యోగ దాతలుగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రం నుంచి కూడా గూగుల్, వాట్సాప్ లాంటి సంస్థలు రావాలని ఆకాంక్షించారు.
అదనంగా, నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీపై తమ వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్లు, వికలాంగుల సమస్యలు
దేశంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ అవసరమని కవిత అభిప్రాయపడ్డారు. వారి హక్కులపై పోలీసులకు కూడా సరైన అవగాహన లేదని అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సామాజిక న్యాయం – అన్ని వర్గాలకు సమాన అవకాశాలు
సామాజిక న్యాయం తమ ఐదో ప్రధాన అంశమని పేర్కొన్న కవిత, అగ్రవర్ణాల్లోని పేదలు, వికలాంగులు, మాజీ సైనికులు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఇళ్లు నిర్మించడం కూడా సామాజిక న్యాయమేనని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. బీసీల కోసం ప్రకటించిన నిధుల్లో కొంత మాత్రమే వినియోగిస్తున్నారని, మైనార్టీలకు హామీ ఇచ్చిన సహాయం కూడా పూర్తిగా అందడం లేదని విమర్శించారు.
మహిళల భద్రత, చట్టవ్యవస్థపై ఆందోళన
రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయని కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది సుమారు 2 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రోజుకు సగటున 7 అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
పోలీసు దౌర్జన్యాలు, కమ్యూనల్ హింస కూడా పెరిగిపోయాయని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం స్పందించడంలో నిర్లక్ష్యం చూపుతోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, పోరాటానికి పిలుపు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే న్యాయ సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోసం నిరంతర పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు వెనక్కి తగ్గమని కవిత స్పష్టం చేశారు.
