మాక్లూర్, బతుకమ్మ :
మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామానికి చెందిన ఆంటోని మెట్టు గ్రామ శివారులోని పార్క్ సమీపంలో గాయాలతో మృతదేహంగా కనిపించగా, వెంటనే స్థానిక ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేశారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాజశేఖర్, మొగులయ్యలు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా మెట్టు గ్రామానికి చెందిన అనుమానితుడు ఫ్రాన్సిస్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఏప్రిల్ 10 న రాత్రి తాను, అంటోని కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో అంటోని తనను దూషించడంతో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకున్నట్లు వెల్లడించాడు. ఆ గొడవలో ఫ్రాన్సిస్ రాయితో అంటోని తలపై బలంగా కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు కలిగాయి. అనంతరం అతన్ని కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లినట్లు తెలిపాడు. ఈ ఘటనలో గాయాల వల్ల ఆంటోని అక్కడికక్కడే మృతి చెందగా, ఫ్రాన్సిస్ ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుండి పరారయ్యాడు. సోమవారం అతని ఇంటి వద్ద పట్టుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నేరస్తుడి వద్ద నుండి బండరాయి, దుస్తులు స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు స్థానిక ఎస్సై రాజశేఖర్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
