. . . ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంట్రాక్టు ఏజెన్సీలకు వేతనాలు చెల్లించి, కార్మికులతో కొనసాగుతున్న సిఐజి లకు వేతనాలు ఆపడం సమంజసం కాదని ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. గురువారం సిఐటియు కార్యాలయంలో ఏఐటియుసి, సిఐటియు, టియుసిఐ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, పాత సిఐజిలను కొనసాగించటం తో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దుచేసి కార్మికులతో సిఐజి గ్రూపులుగా కనీసం 15 మందికి తగ్గకుండా ఏర్పాటు చేయాలని కోరుతున్నా కమిషనర్ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కాంట్రాక్టులపై ఉన్న ప్రేమ అధికారులకు కార్మికులపై లేకపోవడం విడ్డూరమన్నారు. కావున ఈ నెల 20 న లేబర్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వాలని, 23 న జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వాలని, 24 న కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, అప్పటికి సమస్యను పరిష్కరించని యెడల ఈ నెల 30 నుండి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమాలను కార్మికులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణ్ లు పాల్గొన్నారు.
