. . . ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వర్ రావు
. . . నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టం, జీ రామ్ జీ చట్టాలను ఉపసంహారించుకోవాలని రైతు సదస్సు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మాది రైతు ప్రభుత్వం అంటూ రైతుల యొక్క నడ్డి విరిచేలా చట్టాలను తీసుకువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వర్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన విద్యుత్ బిల్లు చట్టం, నూతన విత్తన చట్టం, రైతు కూలీలకు ఉపాధి పనుల నుండి దూరం చేసే జీ రామ్ జీ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్ ఆర్ భవన్ లొ రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, సీపీఐ ఎంఎల్ న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య లు అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మన రైతులు వారికి నష్టాలు కలిగినా దేశంలో ఉన్న ప్రజలందరికీ అన్నం పెట్టాలనే ఆలోచనతో రైతులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని, అలాంటి రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులకు తీవ్ర ఇబ్బందులు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా విద్యుత్ సవరణ బిల్లును తీసుకువచ్చి రేపు భవిష్యత్తులో రైతులు వాడే ప్రతి యూనిట్ కు డబ్బులు వసూలు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉందని వారన్నారు. విద్యుత్ మీటర్ లను బిగించినట్లయితే రేపు వ్యవసాయం అనేది చేయడానికి ఎవరు ముందుకు రారని వారన్నారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, రైతు కూలీల కోసం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని ఆలోచనతో తీసుకువచ్చిందని, ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ మోడీ ప్రభుత్వం దాని స్థానంలో వికసిత్ భారత్ జీ రాం జీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రైతులు, రైతు కూలీలు ప్రతి ఒక్కరం కూడా ఐక్యంగా ఉండి మనం వీటన్నింటిని కూడా సాధించుకోవడానికి ఉద్యమించాలని, అప్పుడే మనం వీటిని కాపాడుకొని భావితరాలకు అందిస్తామని వారన్నారు. ఈ సదస్సులో ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, ఎల్. పర్వయ్య, ఏ.చిన్నయ్య, కె. గోపాల్, విట్టల్, ఎ.ఎరన్న, దేవస్వామి, గంగారాం, తిరుపతి సంజీవ్ తో పాటు 150 మంది రైతులు పాల్గొన్నారు.
