. . . కమీషనర్ ఛాంబర్ ముందు ధర్నా
. . . పరిస్థితి ఉద్రిక్తం, పోలీసు బందోబస్తు, సోమసిల్లిన మహిళా కార్మికులు
. . . సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామన్న కార్మిక సంఘాల నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలను రద్దుచేసి, కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీయుసీఐ, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు డ్రైవర్లు, పాత మున్సిపల్ కార్యాలయం నుండి కోర్టు చౌరస్తా, ధర్నా చౌక్ మీదుగా కొత్త మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కమిషనర్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీయుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు, ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ లు మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ కార్మికులతో ఇప్పటికే కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (సిఐజి) ఉన్నాయన్నారు. ఇవి కాకుండా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలో 330 మంది కార్మికులు ఉన్నారన్నారు. వాటర్ వర్క్స్ కార్మికులు, డ్రైవర్లు సిఐజి గ్రూపుల్లో లేరని, వీరిని మాత్రమే కొత్తగా గ్రూపులుగా చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను రద్దుచేసి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలనుకోవడం సరైంది కాదన్నారు. అందువల్ల పనిభారం పెరుగుతుందని, ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను కొనసాగిస్తూ, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ 330 మంది, వాటర్ వర్క్స్ కార్మికులను 25 నుండి 35 మందితో ఒక గ్రూపుగా ఏర్పాటు చేయాలన్నారు. పాత సిఐజి గ్రూపులను కదపాలని చూస్తే పెద్దఎత్తున ఆందోళనలకు పూనుకుంటామన్నారు. ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి సిఐజి గ్రూపు కార్మికులకు వేతనాల ఆపడం అన్యాయం అన్నారు. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో బుధవారం సాయంత్రం లోగా కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. అదే విధంగా ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగ అవకాశం ఇవ్వడంలో కొర్రీలు పెట్టడం మానుకోవాలన్నారు. కేటగిరీల వారీగా ఇతర మున్సిపల్ కార్పొరేషన్ లో ఇస్తున్నట్లు వేతనాలు చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐలలో ఉన్న తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను 14 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని అడిషనల్ కమిషన్ కి సమ్మె నోటీసు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కమిషనర్ కలవడానికి వెళ్ళిన కార్మికుల్లో మాధవి, పార్వతి అనే మహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు.

తోటి కార్మికులు సపర్యలు చేసి, అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు భూపతి రాజేశ్వర్, కిరణ్, గోవర్ధన్, రవి, కిషోర్, నవీన్, సావిత్రి, చంద్రశేఖర్, బాలాజీ, హరీష్, సుజాత, మహేష్, యాదమ్మ, లక్ష్మి, శైలజ, మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
