. . . అప్పటి వరకు నిరాహార దీక్ష కొనసాగుతుంది.
. . . భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది?
. . . తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
వెలుగుమట్లలో భూముల రేట్లు పెరగటంతో పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, కూల్చిన ఇళ్ల స్థానంలోనే పేదలకు కొత్త ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద, ప్రజా వ్యతిరేకంగా మారిందని, ఖమ్మంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్లు కూల్చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తోందని, పేదలంటే లెక్క లేకుండా పోయిందని, అడిగే వాళ్లు లేరనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి స్పందించాలని, వెలుగుమట్లలో భూదాన్ భూమి 30 ఎకరాలు ఉందని, ఆక్రమణకు గురైన మరో 30 ఎకరాల భూదానం భూమి ఉందని, మొత్తంగా 62 ఎకరాల భూమి ఉందని, భూదాన్ భూమి అంటేనే పేదవాళ్లకు ఇచ్చిన భూమని, పేదవాళ్లకు ఇచ్చిన భూమిలో ప్రభుత్వం, కలెక్టర్ కర్కషంగా వ్యవహరించారని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉండే ఇలాంటి సమయంలో అర్ధరాత్రి బుల్డోజర్లతో 750 ఇళ్లను కూలగొట్టారని, విద్యార్థుల హాల్ టికెట్లు ఉన్న ఇళ్లను కూడా కూల్చేశారని, ఇప్పుడు ఆ విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాయాలని ప్రశ్నించారు. బాధితులందరినీ అంబేడ్కర్ భవన్ లో పెట్టారని, నిజంగా ఒక పశువు కొట్టంలోకి వారందరినీ తోలినట్లు తోలారని, అక్కడ పిల్లలకు దద్దుర్లు వస్తున్నాయని, వారి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. బాధితులంతా కూలీ పని చేసుకునే వాళ్లే, ఎన్నో ఏళ్లు కష్టపడి ఇళ్లు కట్టుకుంటే నిమిషాల్లో కూల్చేశారని బాధపడ్డారు. మేము నిన్న ధర్నా చేస్తూ బాధిత శిబిరాన్ని కలెక్టర్ విజిట్ చేయాలని కోరామని, అదేదో అప్రజాస్వామికం అన్నట్లుగా ప్రభుత్వం, కలెక్టర్ పంతం పట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారని, బాధితుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి, ధర్మసమాజ్ పార్టీ విశారదన్ సంయుక్తంగా ఆందోళన చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి కనీసం ఏదైనా ప్రకటన వస్తుందేమోనని భావించి…అంబేడ్కర్ విగ్రహాం సాక్షిగా నిరాహార దీక్ష చేపట్టామని, నిన్నటి నుంచి దీక్ష కొనసాగిస్తుంటే ఇవ్వాళ ఉదయం 6 వందల మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

మేమేదో టెర్రరిస్టులమన్నట్లుగా మమ్మల్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారని, విశారదన్ ని ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదని, ఆచూకీ తెలిశాక ఆయన కూడా పోరాటం చేస్తారని తెలిపారు. నా వంతుగా జాగృతి కేంద్ర కార్యాలయంలో నేను నా దీక్షను కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడితే రాజ్యాంగం పట్టుకొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతారని, తెలంగాణలో పేదల మీద కాంగ్రెస్ ప్రభుత్వమే కర్కషంగా వ్యవహరిస్తే ఎందుకు మాట్లాడటం లేదని, నిజంగా ఇక్కడ ఏం జరిగిందో రాహుల్ గాంధీ తెలుసుకోవాలని, ఇండిపెండెంట్ జ్యూడిషీయల్ ఎంక్వైరీ వేసి నిజాలు తెలుసుకోవాలని రాహుల్ గాంధీని కోరారు. భూదాన్ భూమిలో ఉన్న ఇళ్లను ఎందుకు కూల్చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, భూదాన్ బోర్డు పేదలకు ఇచ్చిన స్థలాలకు పట్టాలు కూడా ఇచ్చిందని, జీవో 58 కింద వాళ్లంతా రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని, ప్రభుత్వ భూమి కాని చోట నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. భూదాన్ భూమిని ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని, ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే పేదల భూములను కబ్జా చేస్తోందని, దీనిపై మేము న్యాయపరంగానూ పోరాటం చేస్తామని, ఖమ్మంలో మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం జులుం చేస్తోందని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తూ పెద్దల బిల్డింగ్ ల జోలికి వెళ్లటం లేదని మండిపడ్డారు. ఈ కూల్చివేతల వెనుక ముగ్గురు మంత్రుల హస్తం ఉందని భావించాల్సి వస్తుందని, ఒక వేళ అలా కాకుంటే ముఖ్యమంత్రి వెంటనే చర్యలు చేపట్టి భాధితులకు న్యాయం చేయాలని, అప్పటి వరకు కూడా నా దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు.

