నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకోర్టు సముదాయంలోని పిపి గంగారెడ్డి మెమోరియల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రానిస్తున్నారని, నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్ లో మహిళల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పగలిగామని ఆమె తెలిపారు. అతివలే అగ్రభాగన నిలబడుతూ దేశాల ప్రగతికి సాంకేతికతను సారతులుగా నిలబడుతున్న చారిత్రాత్మక సందర్భాలు మన ముందు ఉన్నాయని ఆమె వివరించారు. మహిళల అభ్యున్నతి కోసం చట్టాలు ఎన్ని ఉన్న స్వతహాగా ఎదగాలని అన్నారు. మహిళలు, గృహిణిలుగా, పని ప్రాంతాలలో ప్రగతి చక్రాలుగా పని చేస్తూ దేశ ప్రగతి నిర్మాణంలో ముందు వరుసలోనే ఉన్నారని జిల్లాజడ్జి తెలిపారు. మొదటి అదనపు జిల్లాజడ్జి హరీష ప్రసంగిస్తూ మహిళ జూనియర్ న్యాయవాదులు అడుగులు ముందుకు వేస్తు వృత్తిలో ఎదగాలని అన్నారు. మహిళలు మరింత గౌరవిస్తూ వారి ఎదుగుదలకు ప్రోత్సాహన్ని అందించాలని ఆమె కోరారు. నాల్గవ అదనపు జిల్లాజడ్జి దుర్గా ప్రసాద్ మాట్లాడుతు న్యాయవాదులుగా వృత్తిలో కష్టపడాలని, కష్టం సుఖమయ జీవితానికి సోపానం అవుతుందని అన్నారు. న్యాయమూర్థులుగా ఈ స్థాయికి వచ్చామంటే కష్టానష్టాలకు ఎదురీదామని జూనియర్ న్యాయవాదులు శ్రమించాలని న్యాయవాద వృత్తిలో ముందు వరుసలో నిలబడాలని ఆయన ఆశించారు. సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ, ఉపాధ్యాయ కీర్తి రాజ్ లు ప్రసంగిస్తు ఒకరోజు మహిళా దినోత్సవం కాకుండా అన్ని రోజులు మహిళా దినోత్సవాలే ఉండాలని అభిలాషించారు. బార్ అధ్యక్షులు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాని కార్యదర్శి మాణిక్ రాజు మహిళలు మహారాణులు కావాలని అన్నారు. ఆటపాటలతో, ప్రసంగాలతో మహిళలు ఆలరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు గోపికృష్ణ, శ్రీనివాస్ రావు, బార్ ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేష్, మహిళ న్యాయవాదులు నీరజ రెడ్డి, కవిత రెడ్డి, ప్రవీణ, ఝన్సిరాని, లిల్లీ, తదితరులు పాల్గొన్నారు.

