. . . యోచన ప్రజా కవి వాగ్గేయకారుడు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అరుణోదయ సంస్థ ప్రజా కళాకారులకు స్ఫూర్తిదాయకమని ప్రజాకవి వాగ్గేయకారుడు యోచన అన్నారు. అరుణోదయ నిజామాబాద్ జిల్లా మహాసభ బుధవారం నగరంలోని ఎన్ ఆర్ భవన్ లో జిల్లా అధ్యక్షులు సూరిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని యోచన మాట్లాడుతూ అరుణోదయ సంస్థ శ్రామిక జనపక్షపాతిగా అణచివేత, నిర్బంధాలను అధిగమించి, పీడిత జనవాళిని పోరాట దివిటిలుగా తీర్చిదిద్దుతుందని ఆయనన్నారు. అరుణోదయ జనగానమై, దోపిడి పై యుద్ధభేరి మోగిస్తుందని ఆయన తెలిపారు. అమాయక ప్రజల్ని ఆలోచింపచేసి, సత్యాన్వేషణ కోసం సాంస్కృతిక సారథులుగా తీర్చిదిద్దిన చరిత్ర అరుణోదయకు ఉందని ఆయన తెలిపారు. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని నమ్మిన అరుణోదయ నది ప్రవాహంలా పయనిస్తోందని ఆయనన్నారు. ప్రజా కళారూపాలను జానపద గేయాలను, ఒగ్గు కథ, బుర్రకథ, జముకుల కథ, వీధి నాటిక, కోలాటం, డప్పు దరువు, గొబ్బియలు, జనగానం, నృత్య ప్రదర్శన లాంటి అనేక కళారూపాలని ఎన్నుకొని ప్రజల కష్టాల్ని, కష్టాలకు కారణమైన దోపిడీనీ ఎలా నిర్మించాలి అనే సందేశాలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లిందని ఆయన తెలిపారు. వర్గ రైతు సమాజం కోసం ఉద్యమ బిడ్డలను సృష్టిస్తోందని ఆయనన్నారు. అందుకే అరుణోదయ అంటే నాకు మక్కువ అని తెలిపారు. కేవీ రమణ జర్నలిస్టు మాట్లాడుతూ నేడు దేశంలో ప్రజల్ని మూఢనమ్మకాలు, తప్పుడు భావనలు అభివృద్ధికి ఆటంకంగా చేస్తున్నాయని ఆయనన్నారు.

శాస్త్రీయ ధోరణిలను ప్రజలకు అందించి, అభివృద్ధి ఆకాంక్ష విధంగా అరుణోదయ సంస్థ కృషి చేయవలసిన బాధ్యత మరింత పెరిగిందని ఆయనన్నారు. సామాజిక సూత్రాల ప్రకారం మన పయనం అభివృద్ధి కరంగా ఉండాలని, కానీ బూజు పట్టిన పురాతనమైన అందాకార భావాలతో ఉన్న వాళ్లు అధికారంలో ఉండడం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన భావించారు. ప్రజల్ని చైతన్యవంతంగా ఆలోచింప చేయడానికి ప్రజా కళాకారులుగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రమణ తెలిపారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ నేడు కళారంగాన్ని పాలకులు వ్యాపారికరిస్తున్నారని ఆయనన్నారు. దోపిడీని రక్షించే ఆయుధాలుగా సాంస్కృతిక రంగాన్ని అధికార వర్గాలు వినియోగించుకుంటున్నాయని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా కళాకారులను వేధించి స్వరాలను నిర్బంధిస్తుందని ఆయనన్నారు. దోపిడీ పీడనలేని వ్యవస్థ కోసం ప్రజా కళాకారులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ 1974 లో పురుడు పోసుకున్న అరుణోదయ అనేక మంది ప్రజా కళాకారులకు పుట్టింటి గా మారిందని ఆయన తెలిపారు. తెలంగాణ పోరాటంలో తన ప్రత్యేకతను చాటుకుందని ఆయనన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని హరించే గుట్కాను నిషేధించాలని, ప్రజల్ని అంధత్వంలో ఉంచే మూఢనమ్మకాలను వదిలి వాస్తవాల వైపు ఆలోచించాలని అరుణోదయ ప్రచారం ఆందోళన చేసిందని దాసు తెలిపారు. ఉదయిస్తున్న చిహ్నంతో ప్రజల జీవితాల్లో వెలుగు రేఖలు నింపాలని, సమ సమాజం కోసం అరుణోదయ సమరభేరి మోగిస్తుందని దాసు అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ (మాస్ లైన్), ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు సిర్ప లింగన్న పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు. అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉపాధ్యక్షులు బండమీది నరసయ్య, సహాయ కార్యదర్శులు గోపాల్, సుధాకర్, నతానియల్ నాయకులు సాయిరెడ్డి, భారతి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

