. . . తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి పాల్గొన్న మల్ల యోధులు
బిచ్కుంద, బతుకమ్మ:
మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి జాతర ఉత్సవాలను బిచ్కుందలో మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు హోరా హోరీగా కొనసాగాయి. ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ కుస్తీ పోటీలను వీక్షించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. స్థానిక మఠ సంస్థాన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం నిర్వహించిన కుస్తీ పోటీల్లో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఉమ్మడినిజామాబాద్ జిల్లా పరిసర గ్రామాలకు చెందిన మల్ల యోధులు పాల్గొని తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ పోటీలను పురస్కరించుకొని నిర్వాకులు పహిల్వాన్ ల స్థాయిని బట్టి రూ.10 నుంచి రూ.5000 వరకు పోటీలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పహిల్వాన్ లు కుస్తీ పోటీలో పాల్గొంటూనే ఉన్నారు. బిచ్కుంద ప్రాంతాల్లోని గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాలలో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. మహాశివరాత్రి జాతర సందర్భంగా గత కొన్ని శతాబ్దాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమయ్యప్ప స్వామి తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల్లో యువత, క్రికెట్, తదితర క్రీడల పట్ల మోజు చూపుతున్నప్పటికీ గ్రామీణ ప్రజలు మాత్రం ఈ కుస్తీ పోటీల పట్ల మోజును వీడడం లేదు. ఈ పోటీలను వీక్షించడానికి చిన్న, పెద్ద మహిళలు అనే తారతమ్యం లేకుండా భారీ ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు సైతం ఏర్పాట్లు చేశారు.

