. . . నిషేధిత గంజాయి పై అధికారులు, ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇటీవల విధి నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పై గంజాయి అరాచక ముఠా జరిపిన దాడిలో తొమ్మిది రోజులపాటు చావు బతుకులతో పోరాడుతూ శనివారం రాత్రి తుదిత్వాస విడిచిన ఆమెకు సంతాపం తెలుపుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిషేధిత గంజాయి ఏరివేత కోసం తను నిర్వహిస్తున్న విధుల్లో భాగంగా ఆమెను తీవ్రంగా దాడి చేయడాన్ని బిజెపి పార్టీ తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్బన్ నియోజకవర్గం గంజాయి రహిత జిల్లాగా ఉండేటట్లు ఎక్సైజ్ అధికారులు ఇకపై గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి ఎన్నో కలలు కన్న కానిస్టేబుల్ సౌమ్య తొమ్మిది రోజులపాటు చావు బతుకులతో పోరాడి శనివారం రాత్రి మరణించారనే వార్త తనకు ఎంతో బాధ కలిగించిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి వహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అన్నారు. అలాగే ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
