. . . బాన్సువాడ ఎన్నికల్లో రాజుకున్న రాజకీయ సెగ
. . . ఆశావాహుల ఎదురుచూపులు
బాన్సువాడ, బతుకమ్మ :
అధికార కాంగ్రెస్ పార్టీలో మున్సిపాలిటీ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థుల బీఫామ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పటికే గ్రామ పంచాయతీలలో ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోగా మున్సిపాలిటీ ఎన్నికలపై నాయకుల దృష్టి పడింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గానికి బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి మధ్య బీఫాంల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. పట్టణ కేంద్రమైన బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫాంలు దక్కించుకునేందుకు ఆశావాహులు ఇరువురి నేతలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. తమకు టికెట్టు దక్కకపోతే ప్రత్యామ్నాయంగా ఇండిపెండెంట్గా బరిలోకి సిద్ధమవుతున్నారు. కొందరు సిట్టింగ్ కౌన్సిలర్లకు మరోసారి బీఫామ్ దక్కనుందనే ప్రచారం…
. . . కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్ర పోటీ
అధిక వార్డుల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉంది. సిట్టింగ్ కౌన్సిలర్లు ఉన్నచోట కొత్త వారు చాలా మంది ఆశావాహులు టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీ జెండా మోస్తున్న తమకు ఈసారైనా అవకాశం ఇవ్వరా అంటూ కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వని పక్షంలో ఏం చేయాలన్న దానిపై పలువురు స్పష్టతతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చివరి నిమిషం దాక ప్రయత్నించి దక్కని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా కొందరు రెడీ అవుతున్నారు. ఎన్నికలలో తప్పక పోటీ చేస్తామని, పార్టీ టికెట్ ఇవ్వకపోతే రెబల్ గా బరిలో నిలుస్తామని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వార్డులలో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తప్పక పోవచ్చని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
. . . వార్డుల్లో ఎన్నికల వాతావరణం
బాన్సువాడ మున్సిపాలిటీ 19 వార్డులలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఒక వైపు పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఆశావాహులు టికెట్ ఆశిస్తున్న వారు తమకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్తుందంటూ అభ్యర్థులు చెప్పుకునే ఓటు అభ్యర్థిస్తున్నారు. కొందరైతే తమకు మద్దతు ఇస్తే కాలనీలో చేసే అభివృద్ధి పై మాట ఇస్తున్నారు. మరికొందరు రోడ్ల మరమ్మత్తులు చేపడుతూ కమ్యూనిటీలవారీగా కుల సంఘాలు, యువజన సంఘాలతో భేటీ అవుతూ ఓటర్లను ప్రభావితం చేసే వారితో మమేకమవుతూ మంతనాలు చేస్తూ తమకు ఈసారి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
. . . తెగని బీఫాంల పంచాయతీ
బాన్సువాడ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులకు బీఫాంల పంపిణీ విషయంలో ఇరువురు నేతల మధ్య పోటీ నెలకొంది. 19 వార్డులకు గాను తమ వారికే ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబడుతుండగా, ఇప్పటికే ఏనుగు రవీందర్ రెడ్డి పలువురు పార్టీ పెద్దలను కలిసి చర్చిస్తూన్నట్టు సమాచారం. ఇరువురికి సమానంగా సీట్లు ఇచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఏనుగు అనుచరులకు బీ ఫాంలు ఇవ్వలేని పక్షంలో తన పానల్ రెబల్ గా పోటీ చేసి గెలిపించుకుంటారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
