27.3 C
Hyderabad
Friday, July 31, 2026

బోధన్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్

Must read

📰 Generate e-Paper Clip

. . . మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం వేముల ప్రశాంత్ రెడ్డి

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, గతంలో షకీల్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తున్నదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బోధన్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబోధన్ టౌన్ మీటింగ్ చూస్తుంటే ఇది పట్టణ సభ కాకుండా నియోజకవర్గ, జిల్లా స్థాయి సభలా ఉందని, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని బట్టి బోధన్ మున్సిపాలిటీపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షకీల్ నాయకత్వంలో 36 కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో షకీల్ బోధన్ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించారని, అందులో ఇప్పటికే రూ.60 కోట్ల పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. మిగిలిన రూ.40 కోట్ల పనులను గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. పట్టణంలో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారినా, కనీసం మరమ్మతులు చేయలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, పాలనంతా అవినీతి, దోపిడీతో నిండిపోయిందని ఆరోపించారు. సివిల్ సప్లైస్, లిక్కర్, బొగ్గు కుంభకోణాల్లో కాంగ్రెస్ మంత్రులు, సీఎం వాటాల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. మంత్రుల మధ్య వాటాల పంపకాల గొడవలు రోడ్డెక్కాయని ఎద్దేవా చేశారు. షకీల్ హయాంలో పగడపల్లి వద్ద నదిపై చెక్‌డ్యాం నిర్మించి రైతులకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త చెక్‌డ్యాం కూడా నిర్మించలేకపోయిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై తుపాకీ పట్టుకొని తిరిగిన చరిత్ర ఉందని, అలాంటి వ్యక్తికి బీఆర్ఎస్ జెండాను తాకే నైతిక హక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లుగా అమలు చేయలేదని విమర్శించారు. ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేల బాకీ పడిందని లెక్కలతో వివరించారు. ఇచ్చిన హామీల వీడియోలను ప్రతి ఇంటికి వెళ్లి చూపించాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని, రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. బోధన్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షకీల్, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్, గిర్ధవర్ గంగారెడ్డి, బోధన్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్  నర్సింగ్ రావు, మాజీ జెడ్పిటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

 

Congress obstructed the development of Bodhan
Congress obstructed the development of Bodhan

More articles

Latest article