బిచ్కుంద, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సింధే పలు కార్యక్రమాలపై నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక జుక్కల్ చౌరస్తా వద్ద ఆగి స్థానిక రైతులతో ముచ్చటించారు. అధికారులు సకాలంలో స్పందిస్తున్నారా? బోనస్ రూ. 500 ఖాతాలో పడుతున్నాయా? అని రైతులు అడగగా అధికారులు సరిగా పట్టించుకోవడంలేదని రైతులు వాపోయారు. గతంలో వేసిన పంటకు బోనస్ ఇప్పటివరకు రాలేదని తెలిపారు. ఈ సందర్భంగా హనుమంత్ సింధే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం వడ్ల బోనస్ డబ్బులు అందేదెప్పుడోనని రైతులు ఆందోళన చెందుతున్నా రన్నారు. గత యాసంగి సీజన్ బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉండగా, మూడు నెలలుగా బోనస్ డబ్బుల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతుల ఖాతాల్లో మాత్రం బోనస్ డబ్బులు జమ కాక పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు రావలసిన బోనస్ డబ్బులు విడుదల చేయాలని, రోడ్డుపై ఆరబెట్టుకుంటున్న పంటలన్నింటిని సకాలంలో కొనుగోలు చేయాలని హన్మంత్ సింధే డిమాండ్ చేశారు.
