27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

మంచిప్ప, మోపాల్, బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది, మంచిప్ప గ్రామం, పరిసర తండాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పష్టం చేశారు. మంచిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామస్తులకు, చుట్టుపక్కల తండాలకు ఈ దవాఖాన ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు నాణ్యమైన వైద్యం పొందడానికి ఇది పెద్ద సహాయమని తెలిపారు. పాత డిజైన్ ప్రకారమే రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది, ఒక్క గుంట భూమి కూడా ప్రజల నుంచి తీసుకోబోదని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం అని పేర్కొన్నారు.  మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లక్షా 50 వేల రుణ భరోసా కల్పించామని చెప్పారు. మహిళా సంఘాలు కలిసి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే మోడల్, సోలార్ ప్లాంట్‌ల ద్వారా విద్యుత్ సరఫరా వంటి వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వానికి బలం చేకూర్చుతున్నాయని తెలిపారు. మునుపటి ప్రభుత్వంలో మంచిప్ప రిజర్వాయర్ పరిమాణం పెంచే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి తాము కూడా నిరసన తెలిపిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పాత డిజైన్‌కే కట్టుబడి ఉన్నామని అన్నారు. గత ప్రభుత్వంలో మంచిప్ప బ్యాంకును ఎత్తివేయాలని ప్రయత్నించగా, తాము గెలవగానే ఆ నిర్ణయాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. త్వరలో క్రొత్త బ్యాంక్ భవనాన్ని ప్రారంభించబోతున్నాము అని చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాల్లో మంచిప్ప గ్రామంలో ఎవరూ ఇల్లు లేకుండా ఉండకుండా, అందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తాము అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మండల అధ్యక్షులు సాయి రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు రాజేష్, మాజీ జెడ్పిటిసి మోహన్, మాజీ ఎంపీటీసీ శంకర్, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Manchippa Reservoir is based on the old design

More articles

Latest article