మహబూబ్ నగర్, బతుకమ్మ : పాలమూరు ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని క్షమించరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యనించారు. జాగృతి జనం బాటలో భాగంగా కవిత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్ సందర్శించి మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం చారిత్రక అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లను సుప్రీంకోర్టు సస్పెన్షన్ లో పెట్టినా… రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమన్నారు. సీడ్ల్యూసీ ప్రాజెక్ట్ ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ లోంచి తీసేసిందని, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదన్నారు. సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు నీరిచ్చే వరప్రదాయని కృష్ణానది అని, తెలంగాణ సిద్దించిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నామన్నారు. – కేసీఆర్ హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా సరే ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఉద్దండపూర్, కరివెన లో ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదన్నారు.నార్లపూర్ నుంచి ఎదెల వరకు వచ్చే టన్నెల్ పనులను చేయటం లేదన్నారు. నీళ్లను వాడుకోవటం లేదని, ఆల్మట్టి ఎత్తు పెంచితే మాట్లాడటం లేదని, అక్కడ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే ఉన్నా చూస్తూ ఊరుకుంటున్నారన్నారు.

