- కొత్త జీ ఓ ఇవ్వకపోతే ఉద్యమమే
- స్థానిక కోట లేక అవకాశాలు కోల్పోతున్న వైద్య విద్యార్థులు
- హెచ్ ఆర్ డీ ఏ ప్రతినిధి డాక్టర్. బండారి రాజ్ కుమార్
కరీంనగర్, బతుకమ్మ : కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెనక్కి తగ్గి, ఏంక్యూ. 1 లో స్థానిక వైద్య విద్యార్థులకు స్థానిక కోటా 85% కు పెంచాలని హెచ్ ఆర్ డీ ఏ సీనియర్ ప్రతినిధి డాక్టర్. బండారి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బతుకమ్మతో మాట్లాడుతూ కోటా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా చట్టపరమైన మరియు సామూహిక ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. స్థానిక కోటా అమలు చేయకుండా ఎమ్ క్యూ – 1 వైద్యానంతర ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభించాలన్న కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ నిర్ణయం తెలంగాణ వైద్య విద్యార్థులలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించిందన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర వైద్య రంగంలో తీవ్రమైన వ్యతిరేకతకు దారితీస్తుందని, వైద విశ్వవిద్యాలయం వెంటనే వెనక్కి తగ్గి స్థానిక కోటాను అమలు చేయాలని ఆయన కోరారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల వరకు వైద్య పట్టభద్రులు ఉత్తీర్ణులు అవుతున్నారని, అయితే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఉన్న వైద్యానంతర సీట్లు రెండువేల నుండి రెండువేల రెండు వందల వరకు మాత్రమే ఉన్నాయన్నారు. వీటిలో సుమారు ఏడువందల సీట్లు ఎమ్ క్యూ – 1 వర్గానికి చెందినవి కాగా ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు నలభై, నలభై రెండు ప్రకారం ఈ సీట్లు ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో నలభై శాతం కంటే ఎక్కువ సీట్లు తెలంగాణేతర విద్యార్థులు పొందగా, అర్హత సాధించిన వందలాది స్థానిక విద్యార్థులు అవకాశాలు కోల్పోయారన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండువేల ఇరవై మూడు సంవత్సరంలో జారీ చేసిన ఉత్తర్వు నంబర్ నూట రెండు ప్రకారం ఎమ్ క్యూ – 1 సీట్లలో ఎనభై ఐదు శాతం స్థానిక విద్యార్థులకు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం ఆ రాష్ట్ర విద్యార్థులకు ఆరు వందలకుపైగా వైద్యానంతర సీట్లు రక్షించబడుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం, వైద్య సంఘాలు, విద్యార్థి సంఘాలు,సీనియర్ వైద్యులు ఎనిమిదేళ్లుగా పలు మార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో మార్పులు చేయలేదన్నారు. దీని ఫలితంగా తెలంగాణ విద్యార్థులు వరుసగా అవకాశాలు కోల్పోతునే ఉన్నారని, స్థానిక కోటా అమలు చేయకపోవడం న్యాయబద్ధంగా, నైతికంగా, సామాజికంగా అంగీకరించలేని విషయం అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త ఉత్తర్వు జారీ చేసి ఎమ్ క్యూ – 1 సీట్లలో ఎనభై ఐదు శాతం స్థానిక కోటా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఈ సమస్య న్యాయస్థానాల వరకు వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థుల పెద్ద ఉద్యమానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఇది కేవలం సీట్ల సమస్య మాత్రమే కాకుండా తెలంగాణ వైద్య విద్యార్థుల భవిష్యత్తు, హక్కులు, ప్రతినిధిత్వానికి సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ వైద్య విద్యార్థులు ఎమ్ క్యూ – 1 వర్గంలో స్థానిక కోటా లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఇది పరిపాలనా నిర్లక్ష్యం మాత్రమే కాకుండా తెలంగాణ వైద్యులపై జరుగుతున్న వ్యవస్థాపిత అన్యాయం అని ఆయన దుయ్యబట్టారు. స్థానిక కోటా సాధించే వరకు వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే చట్టపరమైన వేదికల్లోను, ప్రజా వేదికల్లోను పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. స్థానిక కోటా అమలు విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వెనుక కొన్ని ప్రభావవర్గాల మౌన ఒత్తిడులు, రాజకీయ స్వార్థాలు,విధానపరమైన బలహీనతలు ఉన్నాయని వైద్య వర్గాలు తీవ్రంగా భావిస్తున్నాయన్నారు. ఈ అంశంలో గత ఎనిమిదేళ్లుగా పలు సంఘాలు, వైద్యులు, విద్యార్థులు పునరావృతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా, స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం విద్యార్థుల న్యాయమైన హక్కులను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోవడమే అని వారు అభిప్రాయపడుతున్నరన్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వైద్య సమాజం రాష్ట్రవ్యాప్తంగా బలమైన స్పందనకు సిద్ధమవుతోందని ఆయన స్పష్టం చేశారు.
