29 C
Hyderabad
Monday, August 3, 2026

రిజర్వేషన్ల గుట్టు కలెక్టర్లకే ఎరుక

Must read

📰 Generate e-Paper Clip

  • ఖరారుకు నేడే చివరి రోజు
  • బహిర్గతం చేయవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలు
  • ఆశవాహుల్లో అలజడి

 

నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎన్నికల నిర్వాహణపై సందిగ్ధం నెలకొంది. అయితే రాష్ట్ర అధికార యంత్రాంగం మాత్రం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకారం ముందుగా రిజర్వేషన్ల ఖరారుకు సిద్దమైంది. ఈ నెల 23 నాటికి జడ్పీటీసీ, జడ్పీ చైర్ పర్సన్, జడ్పీ చైర్మన్, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కులగణన సర్వే ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దాని ప్రకారం ఎస్సీ రిజర్వుడ్ ప్రాంతాల్లో ఎన్నికలకు ఆయా కులాల వారీగా రిజర్వేషన్లను ఖరారుకు సిద్దమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై విషయంపై చర్యలు తీసుకోకుండా మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉండడంతో రిజర్వేషన్ల ఖరారును బహిర్గతం చేయవద్దని సీఎస్ రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది.

స్థానిక సంస్థల ఎలక్షన్ ప్రిపరేషన్ షెడ్యూల్ ను ఆదివారం ఖరారు చేస్తూ పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల ఖరారు, మార్గదర్శకాలను అందులో పేర్కొంది. ప్రధానంగా రాష్ట్రంలోని 12,760 పంచాయితీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5763 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు పంచాయితీరాజ్ శాఖ సన్నద్దమౌతుంది. ప్రత్యక్ష ఎన్నికల అనంతరం 565 మండల పరిషత్ లు, 31 జిల్లా పరిషత్ ల అధినేతల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ను రూపొందించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు. షెడ్యూల్డ్ ఏరియాలలో ఎస్టీల జనాభా దమాషా ప్రకారం 50 శాతం తగ్గకుండా జనాభా ఉంటే రిజర్వేషన్లను వంద శాతం గ్రామ పంచాయితీల్లో సర్పంచ్ లు, వార్డు మెంబర్ల పదవులన్నీ వారికే రిజర్వు చేస్తారు. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లను ఈసారి మినహాయించి మిగిలిన వాటిలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ కేటగిరిలో 50 శాతం  సీట్లను మహిళలకు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన సీట్లను మినహాయించి మిగిలిన వాటికి మాత్రం లాటరీ పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత మిగిలిన సీట్లను అన్ రిజర్వుడ్ గా ప్రకటిస్తారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైన చోటామోటా లీడర్లు రిజర్వేషన్ల వ్యవహరాన్ని బహిర్గతం చేయకపోవడంతో కలవరం మొదలయింది. అధికార కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో స్థానిక పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి రిజర్వేషన్ల ఖరారు వ్యవహరం అంతుచిక్కడం లేదు. రిజర్వేషన్లను ఖరారు అయినప్పటికీ జిల్లా కలెక్టర్లు బహిర్గతం చేయవద్దని ఆదేశాలు రావడంతో ఆశవాహుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. రేపోమాపో ఎన్నికలు అన్నట్లుగా ప్రచారం జరుగడంతో ఇప్పటికే ఖర్చు తడిసి మోపెడయిందని అభ్యర్థులు వాపోతున్నారు. తీరా రిజర్వేషన్లు మారితే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీరాజ్ అధికారులు రిజర్వేషన్ల ఖరారు షెడ్యూల్ ను ఆదివారం ప్రకటించిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా స్థానిక ఎన్నికలపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో చోటామోటా లీడర్లు, పార్టీ నాయకులు అధినేతల మాటలపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏం చేస్తుందోనని ఆందోళన ఒకవైపు, రిజర్వేషన్ల ఖరారుపై ఆందోళన మరొక వైపు అన్న చందంగా అభ్యర్తుల పరిస్థితి మారింది.

More articles

Latest article