బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నపల్లి గ్రామంలో గురువారం జరిగిన దోపిడీ ఘటన గ్రామస్తులను కలవరపరిచింది. బాధితులు నరేందర్-విజయ దంపతులు ఇంటికి తాళం వేసుకొని బంధువుల శుభకార్యానికి వెళ్లిన సమయాన్ని దొంగలు అదునుగా భావించారు. సాయంత్రం సమయంలో స్థానికులు ఇంటి తాళం పగలగొట్టి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి, యజమానులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి చేరుకున్న నరేందర్ దంపతులు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు అదృశ్యమైందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించగా, మొత్తం 3.5 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 30,000 నగదు దొంగతనానికి గురైనట్లు తేలింది.

