- బండి సంజయ్, కిషన్ రెడ్డి నిజస్వరూపం బయట పెడతాం
- బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తాం
- టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి బీసీ బహిరంగ సభతో కేంద్రం దిగి రావాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాలులో నిర్వహించిన బీసీ బిల్లు సభ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘కామారెడ్డి పట్టణం భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొందని, సీఎంతో పాటు తాను కూడా ఏరియల్ సర్వేకు వచ్చానని, వాతావరణం అనుకూలించక ఇక్కడ దిగలేకపోయామన్నారు. నేను పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 15వ తేదీన సంవత్సరం కావస్తుంది అదే 15వ తేదీన బీసీ రిజర్వేషన్ అమలుపై సంబరాలు జరిపేందుకు సభ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారని గుర్తు చేసారు. 1930 తర్వాత కుల సర్వే జరిగింది తెలంగాణలో మాత్రమేనన్నారు. కుల సర్వేలో బిసిలు 56.33 శాతం, ఎస్టీలు 15 శాతం, ఎస్సిలు 10.20 శాతం, అగ్రవర్ణాలు 10-15 శాతం ఉన్నట్టు శాస్త్రీయ బద్దంగా చేపట్టిన సర్వేలో తేలిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో బిసిలు కాకుండా ఇతర నాయకులు ఉన్నా బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలిపారని, అది కాంగ్రెస్ పార్టీ సిద్దాంతమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు విద్య, ఉపధిలో 42 శాతం కల్పిస్తూ తీర్మానం చేసిందన్నారు. ఈ బిల్లు చట్టం కాకుండా బీజేపీ నాయకులు ఆపుతున్నారని ఆరోపించారు. బీసీ బిల్లు ఆపుతున్న నాయకుల భరతం పట్టడానికి, వారి భాగోతం బయట పెట్టడానికే కామారెడ్డి సభ నిర్వస్తున్నామన్నారు. బిజెపికి దేవుడి పేరు లేనిదే వాళ్లకు ఓట్లు రాలవన్నారు. శ్రీరాముడు, శివుడు, ఆంజనేయుని పేర్లతో తప్ప అభివృద్ధిపై ఓట్లు అడిగే పరిస్తితి లేదన్నారు. ఆరు గ్యారెంటీలపై హామీ ఇస్తే ప్రజలు గెలిపించారని తెలిపారు. అదే సభలో బిసిలను ఆదుకుంటామని చెప్పామని, మూడు చట్టాలు తెచ్చామన్నారు. బీసీ బిల్లు ఆపాలని కేంద్రంలోని నాయకులు చూస్తున్నారు ఆపినా ఆపకపోయినా అసెంబ్లీలో బీసీ బిల్లుపెట్టి బీసీ గుండెల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చీర స్థాయి వరకు నిలిచిపోతారన్నారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేశామని, మూడు బిల్లులు ఇచ్చామని, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మంత్రులు చెప్తే తాము నచ్చజెప్పి స్థానిక ఎంత ప్రామాణికమో బీసీలకు 42 శాతం అంతకంటే ప్రామాణికమని చెప్పి రిజర్వేషన్లు అమలు చేసాకే ఎన్నికలకు వెల్దామని చెప్పామన్నారు. బండి సంజయ్ పుట్టుకతోనే మునూరు కాపు అయినా ఏది కూడా బీసీ బిడ్డగా లేదని, అందుకే ఆయన దేశ ముఖ్ లా వ్యవహరిస్తున్నారని చెప్పానన్నారు. తానేదో సెక్యూరిటీ కోసం ఈ మాటలను అంటున్నానని బండి సంజయ్ అన్నారని, బండి సంజయ్ రా.. ఇద్దరం సెక్యూరిటీ వదిలి జనాల్లో తిరుగుదాం. ప్రజలు ఎవరిని గుర్తిస్తారో చూద్దామని సవాల్ విసిరారు. ఇవాళ మోదీని పట్టుకుని బిల్లు ఆపుతారేమో మరొక మూడేళ్ల తర్వాత ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారు బాజాప్త బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. జిల్లా కోడలిగా కవితను అభిమానిస్తామని, లిక్కర్ రాణిగా తెచ్చిన చెడ్డపేరు జిల్లా అంతా బాధపడేలా ఉందన్నారు. బిఆర్ఎస్ లో జరుగుతున్న గొడవ అంత పంపకాల్లో అవకతవకల వల్ల ఇక బిఆర్ఎస్ పార్టీ కథ ముగిసినట్టే. ఈ నెల 15 న కామారెడ్డిలో నిర్వహించే సభ ప్రతిష్టాత్మకమైందని, ఒక్కో కార్యకర్త 100 మందిని తీసుకువచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. బీసీ ఉద్యమానికి ఊపిరి పోసింది సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. బీసీ డిక్లరేషన్ బిల్లు కామారెడ్డి లోని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి అదే కామారెడ్డిలో అమలు చేసి సంబరాలు చేసుకుంటుంది. కామారెడ్డి లో ఇచ్చిన వాగ్దానం అమలు కాబోతున్న సందర్భంగా కామారెడ్డి ప్రజలది మరియు నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ భారీ బహిరంగ సభను బీసీలు అనే కాకుండా ప్రతి ఒక్కరు హాజరై దీన్ని విజయవంతం చేయాలి. ఈ సభలో జాతీయ నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం పాల్గొంటుంది. బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలకు పోతాం దేశానికే ఆదర్శంగా నిలబడతాం. బిజెపి మెడల్ వంచుతాం బీసీ రిజర్వేషన్ అమలు చేసి చూపెడతాం.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో సభ కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15 న నిర్వహించే సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జనగణన, కులగణన శాస్త్రీయ బద్దంగా చేశామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా, కుట్రలు చేసినా, గుడ్డ కాల్చి మీద వేసినా చిత్తశుద్ధితో బీసీ బిల్లు తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోయినా ముందుకు వెళ్తున్నామన్నారు. సభను విజయవంతం చేయడానికి లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నీతి, నిజాయితితో, నిబద్ధతతో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రం పంపిన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకుంటూ రాజకీయం చేస్తుందన్నారు. కులగణనలలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొనలేదన్నారు. సోషల్ ఇంజనీర్, సోషల్ జస్టిస్ జరగాలని బీసీలకు పదవుల పంపకం చేశామని, బీసీలంతా కంకనబద్ధులై సభకు తరలిరావాలని కోరారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదిస్తూ తీర్మానం చేసామన్నారు. తీర్మానాన్ని ఆమోదం కోసం గవర్నర్ కు పంపిస్తే అక్కడినుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళిందని, బిల్లు ఆమోదం చేయకుండా కేంద్రం మోకాలడ్డు పెడుతోందని తెలిపారు. బీసీల రాజకీయ ఎదుగుదలకు సబందించిన బిల్లును కేంద్రం ఆపొద్దన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి ద్వారా ఎన్నికల్లో ప్రకటించామని, ఇచ్చిన హామీ ప్రకారం తీర్మానం చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బిల్లు ఆమోదం కోసం గవర్నర్ కు పంపితే దానిని కావాలని రాష్ట్రపతికి పంపారన్నారు. బిల్లు ఆమోదం కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేసామని, బీసీ బిల్లుకు ఇతర పార్టీలు మద్దతిచినా బీజేపీ అడ్డుపడుతోందన్నారు. బీసీల బిల్లుకు కేంద్రం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పోరాటం కోసం సమరభేరి మోగించాలని కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నామని, ఈ సభ ద్వారా కేంద్రానికి సంకేతం పంపాలన్నారు. బీసీల బలం చూపేలా సభ విజయవంతం చేయాలని కోరారు.
మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. ఈ నెల కామారెడ్డిలో నిర్వహించే బీసీ సభ దద్దరిల్లిపోవాలని, దాంతో కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తలని మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. బీసీల ఐక్యత మరోసారి ఛాటి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంత్ రావు, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వెడ్మాపోజ్జు, స్వయంకృషి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆకుల లలిత, వారికెలా నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

