నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు లోనికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున సోమవారం ప్రాజెక్టు రెండు వరద గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈ అక్షయ్, సాకేత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం 15,482 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుంచి నీరు వస్తున్న కారణంగా ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తి 13,000 వేల క్యూసెక్కుల మంజీర నదిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404.53 అడుగుల (17.123 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అన్నారు. దీంతో ప్రధాన కాలువ ద్వారా 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వాగులు, వంకలు కూడా నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువుల, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి ప్రవాహం ఉన్న కాలువల్లోకి ఎవరు దిగరాదని కోరారు. పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వరద గేట్ల నీటి ప్రవాహం దగ్గరకు గాని, లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని పర్యాటకులకు సూచించారు.
