27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చక్రం తిప్పిన ఆ నలుగురు

Must read

📰 Generate e-Paper Clip

. బదిలీ కాకుండా ఎత్తుగడలు

. జీవో నం.80ను పట్టించుకోని అధికారులు

. నలుగురి పేర్లను దాచిన కలెక్టరేట్

. ఆ అధికారులకు పాలనాకేంద్రం నుంచి ప్రత్యక్ష మద్దతు

 

ఆ నలుగురు జీవో న.80ని తుంగలో తొక్కారు. నాలుగేళ్లు ఒకే చోట పని చేసినవారికి బదిలీ తప్పదనుకున్నా.. వారు తప్పించుకున్నారు. జిల్లా పాలనకు కేంద్రమైన కలెక్టరేట్ నుంచి వారికి మద్దతు లభించడం గమనార్హం. ఆ నలుగురు అధికారులు ఏదో ఒక కారణాన్ని చూపగా, వారికి కలెక్టరేట్ నుంచి పూర్తి సహకారం లభించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

నిజామాబాద్, బతుకమ్మ : చాలా ఏళ్లుగా ఒకే చోట ఉన్న ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించిన రాష్ర్ట ప్రభుత్వం.. ఈ మేరకు జీవో నంబర్ 80ని జారీ చేసింది. ఒకే చోట నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నవారు, ఒకే హెచ్ఆర్ఏ  పరిధిలో  వివిధ విభాగాల్లో పనిచేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాన్ని వీడడం ఇష్టం లేని నలుగురు అధికారులు తమ మెదడుకు పదును పెట్టి కుయుక్తులు పన్నారు. బదిలీ తప్పదనే ఉద్దేశంతో ముందుగానే ఓ అధికారి మాతృ శాఖ నుంచి మరో శాఖకు డిప్యేటేషన్ తెచ్చుకున్నారు. మరో ఇద్దరు కలెక్టరేట్ లో కాకుండా మండలంలో పనిచేశామని తప్పించుకోగా, మరొకరు ఇటీవలే పదోన్నతి వచ్చిందని, తాను బదిలీకి అనర్హుడనని  చెప్పి జీవో 80 పరిధిలో నుంచి తప్పించుకున్నారు. మొత్తానికి ఆ నలుగురు అధికారుల పేర్లు రాష్ట్ర కార్యాలయానికి పంపించిన జాబితాలో లేకుండా జాగ్రత్త పడ్డారు.

పట్టని స్థానికం

కలెక్టరేట్ నుంచి రెవెన్యూ విభాగమైన సీసీఎల్ఎ కమిషనర్ కు నిబంధనల ప్రకారం తయారు చేసిన బదిలీ జాబితాను పంపిస్తుంటారు. జీవో 80లో పొందుపరిచినట్లుగా బదిలీ విషయమై కోరిన సమాచారం మేరకు జిల్లా కలెక్టరేట్ కు ఉద్యోగి వివరాలు పంపాల్సి ఉంటుంది. జిల్లాలో పని చేస్తున్న పలువురికి బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పటికీ.. జాబితాలో ఆ నలుగురి పేర్లు లేకపోవడంతో ఉద్యోగులు ఖంగుతున్నారు. తహసీల్దార్లుగా ఉన్నవారు తప్పనిసరిగా బదిలీపై వేరే జిల్లాకు వెళ్లాల్సిందేననే నిబంధన ఉండగా, బదిలీ నుంచి తప్పించుకున్న నలుగురు అధికారులు తహసీల్దార్లే కావడం విశేషం.

ఏ విభాగం (క్యాడర్)లో ఉన్నా

బదిలీ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్ధేశంతో ఒకేచోట ఏ విభాగంలో ఉన్నా నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన జీవోలో ఉంది.  స్థానికంగా గత పదేళ్లుగా జిల్లా కేంద్రంలోనే డిప్యూటీ తహసీల్దార్లుగా పని చేసి ఇటీవలే తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన వారి పేర్లు బదిలీ జాబితాలో  కనుమరుగయ్యాయి.  వీరితోపాటు కలెక్టరేట్ లో కీలకమైన పోస్టులో ఉన్న అధికారితోపాటు దానిలోనే ఒక విభాగం చూస్తున్న అధికారి పేరు లేక పోవడం గమనార్హం.

తహసీల్దార్లుగా ఇద్దరు

తహసీల్దార్లుగా చేసిన తమకు బదిలీ వర్తించదని చెప్పుకుంటున్నవారు జిల్లా కేంద్రం హెచ్ఆర్ఏ పరిధిలోనే విధులు నిర్వహించారు. జీవో 80లో స్థానిక ప్రమాణం ( స్టేషన్ క్రైటిరియా)ను  చూడమన్నారు. దీని ప్రకారం చూస్తే సాధారణ బదిలీల్లో వీరికి స్థాన చలనం కలగాల్సి ఉండగా, తాము వేరే మండలాల్లో పని చేశామని బదిలీ నుంచి తప్పించుకున్నారు. అయితే వీరు జిల్లాలో ఎక్కడో పని చేశారని కాదు జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలోని మండలాల్లోనే తహసీల్దార్లుగా పని చేశారు.

పేర్లను దాచిన కలెక్టరేట్..?

స్థానికంగా నాలుగేళ్లు విధులు పూర్తి చేసుకున్నవారి వివరాలను పంపించాలని   కలెక్టరేట్ నుంచి రెవెన్యూ ఉద్యోగులను కోరారు. దీంతో ఉన్నది వున్నట్లుగా వారికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టరేట్ కు పంపించారు. బదిలీ నుంచి తప్పించుకోవాలని ఎత్తులు వేసిన వారి పేర్లను దాచి మిగతా ఉద్యోగుల పేర్లతో కూడిన జాబితాను సీసీఎల్ఏ కు పంపించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో చట్ట బద్ధంగా, దాపరికం లేకుండా బదిలీలు జరిగితే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఆ నలుగురి పేర్లు  దాచిపెట్టడం ఎంత వరకు సమంజసమని రెవెన్యూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

వేరే జిల్లాల్లో నాయకులు బదిలీ

సంఘానికి నాయకులమంటూ తిరిగేవారు ముందుగా తమ సహచరులకు న్యాయం జరిగేలా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం వారి స్వార్థప్రయోజనాల కోసం యూనియన్ ను అడ్డుపెట్టుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాలో పని చేసే సంఘం నాయకులు తాము ఒకే చోట నాలుగేళ్లు పని చేశామని బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 80ప్రకారం వారు వేరే జిల్లాలకు వెళ్లిపోయారు. మన జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీనిపై ప్రశ్నిస్తే.. పరిపాలనాసౌలభ్యం (అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్) కోసం ఉంచాల్సి వచ్చిందని సర్ది చెప్పడం వినేవారికి వింతగా అనిపిస్తోంది.  ఏ కారణంతోనైనా బదిలీని ఆపాల్సి వస్తే అదీ సీసీఎల్ఏ నుంచే ఉత్తర్వులు రావాల్సి ఉంటుంది కానీ తెలియని వారికి చెప్పినట్లుగా వీరు  కాకమ్మ కబుర్లు  చెప్పడమేంటని ఉద్యోగులు విస్తుపోతున్నారు. నిబంధనలను పాటించినవారు వేరే ప్రాంతాలకు వెళ్తే   పేర్లను హైడ్ చేసుకున్న ఆ నలుగురు జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా  తిరుగుతున్నారు.

 

More articles

Latest article