- భారతీయ జనతా పార్టీ డిమాండ్
రుద్రూర్, బతుకమ్మ : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంలో కందకానికి ఆనుకుని ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో సుమారు 40 మందిని అధికారులు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో షెల్టర్ ఏర్పాటు చేశారు. సోమవారం బిజెపి నాయకులు పునరావస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు కటికే రామ్ రాజ్ మాట్లాడుతూ.. రుద్రూర్ గ్రామంలోని కందకానికి అనుకొని ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వీరికి నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కందకం నుండి వెళ్లే కాలువను మూసివేసి కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇల్లు నిర్మించుకోవడంతో వర్షపు నీరు వెళ్లడానికి వీలు లేకపోయిందన్నారు. లబ్ధిదారులకు త్వరితగతిన డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేస్తే వీరికి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడేది కాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరాశ్రయులను రెండు నెలల పాటు అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఆశ్రయం కల్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, పార్వతి మురళి తదితరులు పాల్గొన్నారు.

