- నిజాంసాగర్ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- నిండిన కళ్యాణి ప్రాజెక్టు
- సింగితం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద బుంగ
- ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీగా వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఈ సీజన్ లో రెండవసారి శ్రీరాంసాగర్ కు, నిజాంసాగర్ కు వరద పోటెత్తింది. నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయినా కళ్యాణి, సింగితం ప్రాజెక్టులు నిండాయి. పోచారం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయం మొదలైన వర్షం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 89,466 క్యూసెక్కుల వరద ఉండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అది 104879క్యూసెక్కుల పైచిలుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులో శనివారం సాయంత్రానికి 80.5 టీఎంసీలకు గాను 55.639 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 4952 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో నది పరివాహక ప్రాంతంలోకి ప్రజలు వెళ్లరాదని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పై భాగంలోని సింగూర్ డ్యాం నుంచి 43,634 క్యూసెక్కుల నీటిని మంజిరా నదిలోకి వదిలారు. 5 స్పిల్ వే గేట్ల ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆ వరద నిజాంసాగర్ కు తాకుతుంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సాయంత్రానికి 31 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టులో 17.802 టీఎంసీలకు గాను 8.678 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగితం ప్రాజెక్టులో 416.550 గనపుటడుగుల నీటి మట్టానికి గాను 416.200 మీటర్ల నీరు నిలువ ఉంది. 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో సింగితం నుంచి నిజాంసాగర్ కు వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగితం రిజర్వాయర్ లో సర్వ శివారులో బుంగపడడంతో నీటిని మూడు గేట్ల ద్వారా నిజాంసాగర్ లోకి విడుదల చేస్తున్నారు. కళ్యాణి ప్రాజెక్టులో 409.50 అడుగుల నీటి మట్టానికి గాను 408 మీటర్ల నీరు నిల్వ ఉంది. 350 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు మెయిన్ కాలువకు 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో శుక్ర, శనివారాల్లో భారీగా వర్షం కురిసింది. అత్యధికంగా రామారెడ్డి మండలంలో 12 సెం.మీ, మద్నూర్ లో 9, గాంధారిలో 8, సదాశివనగర్, తాడ్వాయిలో 6, లింగంపేట్ లో 5, రాజంపేట్ లో 4 సెం.మీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో రుద్రూర్ లో 4 సెం.మీ, కోటగిరిలో 6 సెం.మీ, వర్నిలో 5 సెం.మీ, మోపాల్ 4 సెం.మీ వర్షం కురిసింది. అత్యల్పంగా సాలురాలో 4.0 మి.మీ వర్షం కురిసింది. వర్ని మండలం జలాల్ పూర్ వద్ద లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. నిజామాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాలను కలెక్టర్ పర్యటన సాగింది.

