26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పట్టణ ఆర్య వైశ్య సంఘం ప్రమాణ స్వీకారానికి బ్రేక్

Must read

📰 Generate e-Paper Clip

  • ఎన్నికల ఫలితాలపై జిల్లా న్యాయస్థానం స్టే
  • అన్ని అనుబంధ కమిటీలకు న్యాయ స్థానం ఉత్తర్వులు అమలు

 

  • నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘం దాని అనుబంధ సంఘాల ఎన్నికల ఫలితాలపై న్యాయ స్థానం స్టే విధించింది.  ఈనెల 6న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ ఆర్య వైశ్య సంఘంతో పాటు శ్రీకన్యకాపమేశ్వరి దేవాలయ కమిటీ, శ్రీనూతన వైశ్య పాఠశాల (చిటిమల్ల హరి ప్రసాద్ జూనియర్ కాలేజ్ కమిటీ), శ్రీవైశ్య భవన్ ఠాణాగల్లీ లకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలను నిలిపివేస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ స్టే ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ ఇంజనీర్ గజవాడ హనుమంత్ రావు సంఘాలకు, కమిటీలకు జులై 6 న నిర్వహించిన ఎన్నికలు, అనంతరం ఓట్ల లెక్కింపు లో పారదర్శకత,అవకతవకలు జరిగినాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గజవాడ హనుమంత రావు తరపున సీనియర్ న్యాయవాదులు మంథని రాజేందర్ రెడ్డి, చిలివేరు హరి ప్రసాద్ లు పైన పేర్కొన్న ఎన్నికల ఫలితాలు, వైశ్య కమిటీలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని వారు కోర్టును అభ్యర్థిస్తు స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల పిటిషన్ ను, డానికి జత చేసిన డాక్యుమెంట్స్ ను అధ్యయనం చేసి, న్యాయవాదుల వాదనలు విన్న జిల్లాజడ్జి భారత లక్ష్మీ ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టే ఉత్తర్వులు జిల్లా సెంట్రల్ నజారత్ కు చేరడంతో కోర్టు బేలీఫ్ పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన దన్ పాల్ శ్రీనివాస్ తదితరులకు అందజేశారు.

పట్టణ ఆర్యవైశ్యం సంఘంతో పాటు అనుబంధ సంఘాల ఎన్నికల ఫలితాలపై  న్యాయ స్థానం స్టే విధించడంతో ఆదివారం జరుగాల్సిన ప్రమాణ స్వీకారానికి బ్రేక్ లు పడ్డాయి. ఈ నెల 6న జరిగిన పట్టణ ఆర్యవైశ్య ఎన్నికల్లో పదివేల పై చిలుకు ఓటర్లు ఉండగా మూడువేల పై చిలుకు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోలింగ్ రోజు మాణిక్ భవన్ పాఠశాలలో గందరగోళం ఏర్పడింది. రిగ్గింగ్ జరిగిందని, అక్రమాలు జరిగాయని ఆనాడే రెండు ప్యానళ్లు ఎన్నికల అధికారులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దాంతో ఓటింగ్ ప్రక్రియ మూడు రోజుల ఆలస్యంగా జరిగాయి. అందులోనూ అక్రమాలు జరిగాయని కోర్టు మెట్లు ఎక్కడంతో న్యాయ స్థానం ఫలితాలపై స్టే విధించింది. ఆది నుంచి వివాదాస్పదంగా మారిన ఆర్య వైశ్య సంఘం ఎన్నికలు చివరకు రచ్చరచ్చగానే జరిగాయి. కుల సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రవేశంతో పట్టణ ఆర్య వైశ్యం సంఘం పరువు గంగలో కలిసింది.

More articles

Latest article