27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

“నషా ముక్త్ భారత్ అభియాన్” విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి 26 వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్  కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. వారం రోజుల పాటు చేపట్టే కార్యక్రమాల విజయవంతానికి చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిజామాబాద్ ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. డ్రగ్స్ మూలాలను గుర్తించి, వాటి రవాణా, విక్రయాలు, వినియోగం జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాల గురించి ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఎవరు కూడా పెడదోవ పట్టకుండా భావి పౌరుల భవిష్యత్తును కాపాడాలని హితవు పలికారు. ముఖ్యంగా యువత మత్తుపదార్థాల బారిన పడకుండా అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తూ అంకితభావంతో కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేసి అవి క్రియాశీలకంగా పని చేసేలా చూడాలన్నారు. రానున్న రోజుల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద స్థానికంగా ఉండే దుకాణాలపై నిఘా ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలిపే సందేశాత్మక వీడియోను అన్ని స్కూళ్ళు, కాలేజీలలో ప్రదర్శించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలను జాగృతం చేయాలన్నారు. ఈ నెల 25 మాదకద్రవ్యాల నియంత్రణ అంశం పై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని అన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల గురించి ప్రజలు సమాచారం అందించేందుకు వీలుగా వివిధ టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారిని గుర్తించి, ఆ వ్యసనం బారి నుండి బయటపడేలా వారిని డీఅడిక్షన్ కేంద్రాలలో చేర్పించి తగిన చికిత్స జరిపిస్తూ కౌన్సిలింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రూపొందించిన గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిజామాబాద్ జోన్ డీఎస్పీ సోమనాథం,  జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డీఐఈఓ రవికుమార్, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

"Nasha Mukt Bharat Abhiyan" should be a success

More articles

Latest article