. . . నిబంధనలు డోంట్ కేర్
. . . ప్రదాన కార్మిక శాఖ సహకారం
. . . రాష్ట్ర వ్యాప్తంగా రూ.వందల కోట్ల నిధులు స్వాహా
. . . లేబర్ ఆఫీస్ పేరుతో కార్మికులకు ఫోన్లు
. . . రక్త పరీక్ష చేసుకోకపోతే కార్డ్ పోతుందని హెచ్చరింపు
. . . లబోదిబోమంటున్న భవన నిర్మాణ కార్మికులు
హైదరాబాద్, బతుకమ్మ :
కార్మికుల పొట్ట గొట్టి తినేవాళ్ళను చూసాం…చూస్తున్నాం. కానీ వారి రక్తం తీసి రూ.కోట్లు సంపాదించేవాళ్ళను చూసారా.. చూడలేదు కదూ .. అవునండి ఇది నిజం …భవన నిర్మాణ కార్మికులకు ఫోన్ చేసి లేబర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం .. ఈ రోజు రక్తపరీక్షలు చేయించుకోకుంటే కార్డు పోతుందని భయబ్రాంతులను కల్పిస్తున్నారు. తెలంగాణలో లేబర్ కార్డు ఉన్నవాళ్ళ ఆరోగ్య దృష్ట్యా రక్త పరీక్షలు చేస్తామని మహారాష్ట్రలోని ముంబాయికి చెందిన సి.ఎస్.సి హెల్త్ కేర్ అండ్ వెల్ నెస్ సర్వీస్ సంస్థ ముందుకు వచ్చింది. ఇంకేముంది అప్పటి తెలంగాణ ప్రభుత్వ అండదండలు, కార్మిక శాఖ ప్రోత్సాహంతో కార్మికులు తీసుకున్న కార్డుల ఆధారంగా రక్తం లాగుతూ సొమ్ము చేసుకుంటున్నారు.2023 జనవరి నుంచి మొదలైన రక్తం గుంజుడు వ్యాపారం ఇప్పటివరకు ఎలాంటి అడ్డూ, అదుపు లేకుండా యదేచ్చగా సాగుతోంది.

రక్తంతో నడుపుతాను రిక్షాను … నా రక్తమే నా రిక్షకు పెట్రోలు .. అప్పట్లో కార్మికుల ఉత్తేజం కోసం పాడిన పాట …, కార్మికుల రక్తాన్నే తీస్తాను.. వారి రక్తమే మా సంస్థకు కోట్ల రూపాయలు అంటూ ఇప్పుడు ముంబాయికి చెందిన సి.ఎస్.సి హెల్త్ కేర్ కంపెనీ పాడుకుంటోంది.
. . . పరీక్షల పేరిట
భవన నిర్మాణ కార్మికులు వారి సంక్షేమార్థం తీసుకున్న కార్డుల ఆధారంగా ఆరోగ్య పరీక్షలు చేపడతామని ముంబై సి.ఎస్.సి సంస్థ ముందుకు వచ్చింది. కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందనే దానికంటే, ప్రభుత్వాదినేతలకు, కార్మికశాఖ ఉన్నతాధికారులకు, దీనిని ముందర వేసుకున్న సంస్థకు లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో సి.ఎస్.సి కి రక్తం గుంజుడు నిర్వహణ బాద్యతలను ఇవ్వాలని ఉత్తర్వులు జారి చేసారేమోననే ప్రచారం జరుగుతోంది. అలా మొదలైన ఆరోగ్య వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
. . . రక్తం గుంజుడు
పరీక్షల కోసం రక్త సేకరణ అనే దాని కంటే గుంజుడు అనే పధం ఇక్కడ సరిపోతుంది. మొదట్లో కాస్త మెరుగ్గా చేసిన రానురాను అర్హతలు లేనివారు రక్తం లాగడం మొదలెట్టారు. ల్యాబ్ సర్టిఫికేట్ ఉన్నవారే రక్త సేకరణ చేయాల్సి ఉంటుంది. వైద్యుల సమక్షంలో పరీక్షలు జరగాల్సి ఉండగా, అర్హత లేని వ్యక్తితో కార్మికుల చేతి నుంచి రక్తం తీసి మూడు చిన్న సీసాల్లో నింపుతున్నారు. వైద్యుని పర్యవేక్షణలోనే వైద్య పరీక్షలు జరిపి, ఎత్తు, బరువు, ఉష్ణోగ్రతలను, నివేదికలో పొందుపరుస్తారు. టెక్నీషియన్ లను, వైద్య పరీక్షలను పర్యవేక్షించే అధికారి ఉండకపోవడం గమనార్హం.

. . . పరీక్షలు అనేకం – చేసేది శూన్యం
అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ ప్రకారం సుమారు 50 పైగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈసిజి, కంటి, ఊపిరితిత్తులు, చెవులు, షుగర్, బిపి, ఎత్తు, బరువు, మూత్రం, రక్త సేకరణతో ఇంకొన్ని పరీక్షలను సంబంధిత వైద్య బృందం సమక్షంలో నిర్వహించాలి. ఒక్క కార్మికునికి పరీక్ష చేసినందుకుగాను సి.ఎస్.సి హెల్త్ కేర్ సంస్థకు కార్మిక శాఖ రూ. 3256 చెల్లింపు చేస్తోంది. ఎక్కడో చోట ఏర్పాటు చేస్తున్న శిబిరంలో కేవలం వైద్యుని పర్యవేక్షణ లేకుండానే రక్తం గుంజి పంపిస్తున్నారు. మూత్రశాలలు లేకపోవడంతో పరీక్షలకు మూత్రం ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చిన అవి పరీక్షలకు నోచుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజు సాగుతున్న రక్త పరీక్షలకు కార్మిక శాఖ అధికారులు, కొన్ని యూనియన్ నాయకుల సహకారం ఉండడం వల్లే ముంబై హెల్త్ కేర్ సంస్థ విచ్చలవిడితనానికి పాలుపడుతోందనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
