నిజామాబాద్ / కామారెడ్డి, బతుకమ్మ:
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి లో 96 అర్జీలు..
ప్రజావాణి లో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై అర్జీలు అందాయి. ఈ రోజు ప్రజావాణి లో (96) అర్జీలు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా శాఖల అధికారులు సాధ్యా సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తు దారునికి రాత పూర్వకంగా సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ వీణ, పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
