- పోలీసుల అదుపులో ముఠా సభ్యులు
- పరారీలో మరి కొందరు
- పట్టుబడిన వారిలో మహారాష్ట్ర వాసులు
నిజామాబాద్, బతుకమ్మ: కల్తీ (మత్తు) కల్లు తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న నిషేధిత మత్తు పదార్థాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సీరియస్ గా ఉన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా రాక మునుపు నార్కోటిక్స్ విభాగంలో పనిచేసిన అనుభవంతో జిల్లాలో మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేకంగా నజర్ వేసి ఫలితాల దిశలో అడుగులు వేస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మత్తు కల్లు బాధితులకు అడ్డాగా ఉండటంతో కల్లుడిపోలకు (కృత్రిమ రసాయినాల)తో తయారీ కర్మాగారాలకు నిషేధిత అల్ర్పాజోలం రవాణాపై ఉక్కుపాదం మోపుతామని నిజామాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా నిజామాబాద్ పోలీసులు, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి 5 గురు అంతర్ రాష్ట్ర అల్ర్పాజోలం రవాణా ముఠాను పట్టుకున్నట్టు తెలిసింది. అందులో ఒక్కరు నిజామాబాద్ జిల్లా సరిహద్ధులోని సాలురాకు చెందిన సూత్రదారి కాగా మిగిలిన నలుగురు మహరాష్ట్రలోని సతారా, పూణే, ఉస్మానా బాద్ జిల్లాల వారు ఉన్నట్టు సమాచారం. మరో నలుగురు పరారీలో ఉండగా అందులో ఒక్కరు మాత్రమే మహరాష్ట్రంలోని పుణే జిల్లాకు చెందిన వారు కాగా మరో ముగ్గురు జిల్లా వాసులు అని తెలిసింది. వారిపై గతంలో నిషేధిత మత్తు పదార్థాల రవాణా కేసులు ఉండగా ప్రత్యేకంగా నజర్ వేసి కాపు కాసి పట్టుకున్నట్టు తెలిసింది. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేస్తుండగా దొరికిన నిషేధిత మత్తు పదార్థం అల్ర్పాజోలం విలువ లక్షల్లో ఉంటుందని తెలిసింది. సంబంధిత ముఠా నిజామాబాద్ జిల్లాలో కల్లు డిపోలకు కావాల్సిన నిషేధిత మత్తు పదార్థాలను సరఫరా చేస్తు కోట్ల రూపాయలు దందా చేస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో గడిచిన నెలలో బీర్కూర్, గాంధారీ మండలాల్లో నిషేధిత మత్తుపదార్థాలు కలిపిన కల్లు క్రయ విక్రయాలలో డోసు పెరిగిందని 60 మంది, డోసు తగ్గిందని 35 మంది ఆసుపత్రుల పాలయ్యారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో మత్తు పదార్థాలు పట్టుబడలేదు కాని నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించిన తరువాత ముడు కేసులలో అల్ర్పాజోలం పట్టుకుని పలువురిని కటకటాల పాలు చేశారు.
