డిల్లీ, బతుకమ్మ : కశ్మీర్ లోని పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ కు భారత్ మరో గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈమేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
పాక్ నుంచి ఓడలు రావొద్దు..
పాకిస్థాన్ తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆదేశ జెండాతో ఉన్న ఓడలు భారత్ పోర్టుల్లోకి రాకుండా నిషేధం విధించింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లులోకి వస్తాయని పేర్కొంది.
