- లారీల కొరతతో ఎక్కడిక్కడే నిలిచిన ధాన్యం
- కృతిమ కొరత సృష్టిస్తున్న లారీ కాంట్రాక్టర్లు
- నల్లమట్టి, ఇసుక తరలింపులో లారీల బిజీ
నిజామాబాద్, బతుకమ్మ : మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. 63వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. వడ్లు కొనుగోళ్లకు సరిపడా తేమ శాతం ఉన్నప్పటికీ 30 రోజులుగా కొనుగోలు చేయటం లేదని అధికారులను రైతులు నిలదీశారు. హమాలీలు కొరత, లారీల కొరత కారణంగా కొనుగోళ్లు చేయటం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ లో నల్లమట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రైతుల అవసరాల కోసం ప్రాజెక్టు అధికారులు తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని చెబుతుండగా అనుమతులకు మించి మట్టి తవ్వకాల రవాణా జరుగుతుంది. నందిపేట్ మండలంలో నల్లమట్టి తవ్వకాల కారణంగా ఇప్పటి వరకు మూడు రోడ్డు ప్రమాదాలు జరిగి ముగ్గురు వరకు దుర్మరణం చెందారు. అటు లోస్ర మండలంలోని పంచగుడి వద్ద, ఇటీవల సి.హెచ్.కొండూర్ వద్ద ప్రమాదం జరిగింది. సి.హెచ్. కొండూర్ వద్ద ప్రజలు నల్లమట్టి తరలింపు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నిరసనకు దిగారు.
మంజిరా పరివాహక ప్రాంతమైన మందర్నా, ఖండ్ గావ్, సిద్దాపూర్ లో ఇసుకను స్థానిక అవసరాల కోసం తహసీల్ధార్ కు డీడీ చెల్లించిన వారికి ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. అక్కడ కూలీల చేత ఇసుక తవ్వకాలు చేసి స్థానికంగా రవాణా చేయాల్సిన వ్యాపారులకు లీడర్లు తోడై ఇసుక ఏకంగా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వరకు లారీలలో, టిప్పర్లలో, టరాజ్ లలో తరలిపోతుంది. బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్ లో ఇసుక రవాణా జాతర కొనసాగుతుంది. అక్కడ స్థానిక అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా అనుమతి తీసుకున్నా స్థానికులు టిప్పర్లలో లారీలను సరిహద్దులు దాటిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పేరుకుపోయింది. లారీల కొరతతో ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఏర్పడడంతో ధాన్యం ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తరలించేందుకు లారీలు లేకపోవడంతో ఇటీవల కురిసిన అకాల వర్షం రైతన్నలను ఆగమాగం చేసింది. అయితే లారీలు జిల్లాలో కొరత లేకున్నా ట్రాన్స్ పోర్టు తీసుకున్న కాంట్రాక్టర్లు కృతిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పాలి. ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను తెరిచిన జిల్లా యంత్రాంగం అక్కడి నుంచి ధాన్యం మిల్లులకు చేరిందా లేదా అన్న విషయాన్ని విస్మరించింది అనే విమర్శలను మూటగట్టుకుంది. అందుకు కారణం లేకపోలేదు ప్రతీ సీజన్ లో ధాన్యంను కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించేందుకు కాంట్రాక్టు తీసుకునే కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని తరలించకుండా ఉంటున్నా అధికార యంత్రాంగం చొరవ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీసారి ధాన్యం కోసం ప్రత్యేకంగా టాస్క్ ఏర్పాటు చేసి రవాణా శాఖ ద్వారా లారీలను ధాన్యం తరలింపునకు చేపట్టే కార్యక్రమాలు ఇంకా మొదలుకాకపోవడమే ఆధారాలుగా రైతులు చెబుతున్నారు. ధాన్యం లిఫ్టింగ్ చేయడం లేదని అందుకే కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం కుప్పలుగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లు, లారీల యజమానులు కుమ్ముకయ్యారని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే వాదనలున్నాయి. ధాన్యం లిఫ్టింగ్ కోసం కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు అధికార పార్టీ పేరు చెప్పి, అధికారుల పేరు చెప్పి ధాన్యం సేకరణ జరిగి రోజులు గడుస్తున్నా ధాన్యంను తరలించడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రతీసారి వారే కాంట్రాక్టర్లు, అవే లారీలు ధాన్యం తరలిస్తుండగా ఈసారి ఎందుకు కొరత ఏర్పడిందనే విషయాన్ని అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం చేతికి వచ్చి ప్రభుత్వానికి అమ్ముదామన్నా లారీలు రావడం లేదని హమాలీల కొరత ఉందని చివరకు గన్నీబ్యాగులు లేవనే సాకుతో ధాన్యాన్ని తీసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇసుక, నల్లమట్టి, మొరం తవ్వకాలకు వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లు, టరాజులు ఉండగా ఎందుకు ధాన్యం సేకరణకు వినియోగించడం లేదన్న ప్రశ్న తలెత్తుతుంది. దానిపై అధికార యంత్రాంగం సమాదానం చెప్పాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.
