- ఇందల్వాయి ఎస్సై పై బాధితుల ఆరోపణ
- ఎస్సైని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిన నేపథ్యం ఇదేనా?
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ సబ్ డివిజన్ లో తరుచు వివాదాల్లో ఉండే ఇందల్వాయి ఎస్సై మనోజ్ కుమార్ ను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. గత పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హయంలో ఇందల్వాయి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్ వివాదాల పుట్టగా పేరు గాంచారు. వ్యక్తిగతంగా డబ్బుల కోసం వేదించడంతో పాటు బౌతికదాడులకు పాల్పడ్డారని గతంలోనూ డీజీపీ మొదలుకుని ఐజీ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటీవల డయల్ 100కు ఫోన్ చేశారని ఒక వ్యాపారిని చితకబాదిన వ్యవహరంపై సీపీ సీరియస్ గా వ్యవహరించి స్పెషల్ బ్రాంచ్ ద్వారా విచారణ జరిపి ఎస్సైని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతుంది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు రావడం కొత్త ఎస్సై బాధ్యతల స్వీకరణ చకచక జరుగడంతో మనోజ్ పై మరిన్ని ఫిర్యాదులు బహిర్గతమౌతున్నాయి.

ఈ నెల 7న ఇందల్వాయి మండలం గండితాండకు చెందిన విస్లావత్ నరేందర్ (40) స్నేహితులతో కలిసి మాట్లాడేందుకు వెళ్లి తెల్లవారేసరికి చెరువులో శవమై తేలడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని స్నేహితులే భర్తను మద్యం తాగించి గొడవ పడి చంపి చెరువులో పారేశారని అతని భార్య విస్లావత్ జ్యోతి ఆరోపించారు. ఈ మేరకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా హత్య కేసు నమోదు చేయకుండా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.తన భర్తకు ఈతవచ్చని ఈ నెల 7న అతని స్నేహితులు ఒక్క రోజునే మూడుసార్లు బయటకు తీసుకెళ్లి గొడవపడ్డారని ఈతవచ్చిన తన భర్తను హత్య చేసి ఏమి ఎరుగనట్లు చెరువులో పడి చనిపోయినట్లు కథ అల్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఇందల్వాయి ఎస్సై మనోజ్ కుమార్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కేసును నీరుగార్చేందుకే సస్పెక్ట్ డెత్ కేసుగా నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

